సినీ, టీవీ పరిశ్రమకు చెందిన నటీనటుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి అనుపమ పాథమ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబై మెట్రోపాలిన్ ప్రాంతంలోని అనుపమ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు భోజ్‌పురి చిత్రాల్లో నటించిన అనుపమ.. ఆ తర్వాత బిహార్ నుంచి ముంబైకి మకాం మార్చింది. పలు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఆమె నివాసం ఉంటుంది. అయితే హఠాత్తుగా ఊరి వేసుకుని తనువు చాలించారు.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. అనుపమ ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో చేసిన చివరి పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది. తను మోసపోయానని, ఎవరిని నమ్మలేకుండా ఉన్నానని తెలిపింది. తనకు సాయం చేసే స్నేహితులు కూడా ఎవరూ లేరని పేర్కొంది. కాగా, అనుపమ భర్త పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.