
భారంగా మారిన కమోడిటీస్ సరఫరాలు
న్యూఢిల్లీ: దేశంలో కార్ల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రోడియం, పల్లాడియం, స్టీల్ వంటి కమోడిటీ ఉత్పత్తుల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కాలుష్య నియంత్రణ కోసం కార్లలో ఉపయోగించే కాటలైజర్లలో రోడియం, పల్లాడియం ప్రధాన ముడి పదార్ధాలు. ఈ రెండు లోహాలకు సంబంధించిన మొత్తం ఉత్పత్తిలో 80 శాతాన్ని ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమే ఉపయోగిస్తుంది.
తగ్గిన సరఫరా
రోడియం, పల్లాడియం రెండు లోహాలు రష్యా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి సరఫరా అవుతాయి. కొవిడ్ కారణంగా ఈ రెండు దేశాల్లో గనులు మూతపడ్డాయి. కొన్ని గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైనా ఉత్పత్తి ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర అమాంతం దూసుకుపోయింది. సరఫరాపరంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఈ రెండు కీలక లోహాల ఉత్పత్తి పెరగకపోవటం పెద్ద భారంగా మారిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సెమీకండక్టర్ల కొరత
కమోడిటీస్ ధరలతో పాటు సెమీకండక్టర్ల కొరత కార్ల కంపెనీలను కలవర పెడుతోంది. కరోనా కారణంగా చైనా, తైవాన్ నుంచి వీటి సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో దేశీయ కార్ల కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. సెమీకండక్టర్ల కొరత కారణంగానే కంపెనీలు దాదాపు ఐదు లక్షల కార్లను కొత్త కొనుగోలుదారులకు అందించలేకపోయినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే లేదా జూన్ నాటికి గానీ ఈ కొరత తీరదని భావిస్తున్నారు.
ధరల పెంపుపై వెనుకంజ
కమోడిటీల ధరల భారం పెరిగిందనే పేరుతో కార్ల కంపెనీలన్నీ గత నెల్లోనే ధరలు పెంచాయి. నెల తిరక్కుండానే మళ్లీ ధరలు పెంచితే ఇపుడిప్పు డే కోలుకుంటున్న డిమాండ్ ఎక్కడ మళ్లీ పడిపోతుందోనని ఆటోమొబైల్ పరిశ్రమ భయపడుతోం ది. మారుతి సుజుకీ అయితే ఇప్పట్లో ధరలు పెం చే యోచన లేదని స్పష్టం చేసింది. అయితే ఇది ఎ న్నాళ్లో ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.