మళ్లీ భారీ బడ్జెట్టే!

0
235
Spread the love

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ఈసారి కూడా భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం భారీగా లేకపోయినా.. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉంది. దీంతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది (2020-21) బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లతో ప్రవేశపెట్టగా.. ఈసారి అంతకుమించి కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ఈ నెల 18న శాసనసభలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ బడ్జెట్‌ రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

బడ్జెట్‌ ప్రతులను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే కరోనా వంటి కారణాల రీత్యా బడ్జెట్‌ ప్రతులను పరిమిత స్థాయిలోనే ముద్రించి, డిజిటల్‌ రూపంలో ఎక్కువగా ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థికశాఖ రూపొందించిన ఈ బడ్జెట్‌కు బుధవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేయనుంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అవసరాలు భారీగానే ఉండనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలంటేనే.. కనీసం రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.20 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.

నిరుద్యోగ భృతికి రూ.8 వేల కోట్లు అవసరం..

రాష్ట్రంలో త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం పరిధిలోకి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల మంది లబ్ధిదారులు చేరవచ్చని, ఇందుకోసం ఏడాదికి కనీసం రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కింద ప్రస్తుతం సుమారు 39.5 లక్షల మంది పింఛనుదారుల కోసం ఏడాదికి సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే వృద్ధాప్య పింఛనుదారుల అర్హత వయసును తగ్గించాల్సి ఉండడంతో కొత్తగా మరో 7 లక్షల మంది ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. మరో రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తుంది. కాగా, ఉద్యోగుల జీత భత్యాలకు ఏడాదికి రూ.30 వేల కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వం 29 శాతం ఫిట్‌మెంట్‌ను ఇస్తే.. మరో రూ.8 వేల కోట్లు అదనంగా అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే.. బడ్జెట్‌లో సుమారు రూ.40 వేల కోట్లను ఉద్యోగుల జీతభత్యాలు, వారి పింఛన్లకే కేటాయించాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్ర ఆర్థిక అవసరాలు భారీగా పెరుగుతుండడం, ఆ మేరకు కేటాయింపులు చేయాల్సి ఉండడంతో బడ్జెట్‌ స్వరూపం కూడా భారీగానే ఉండనుంది.

రాష్ట్ర ఆదాయంలో వృద్ధి..

రాష్ట్ర ఆదాయంలో క్రమేణా వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి పన్నుల ద్వారా రూ. 60,242 కోట్లు రాగా, పన్నేతర రూపంలో రూ.2,801 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఆదాయం సుమారు రూ.1.18 లక్షల కోట్లు వచ్చింది. సుమారు రూ.1.10 లక్షల కోట్లు వ్యయం చేశారు. గతంతో పోలిస్తే.. ఆదాయంలో వృద్ధి నమోదవుతోంది. ముఖ్యంగా ఎక్సైజ్‌, రిజిస్ర్టేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌, జీఎస్టీ ఆదాయం వంటి వాటిలో వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలోనే పన్నుల ద్వారా రూ.7,812 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే అవసరాలను తీర్చడానికి వీలుగా భారీగా అప్పులు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేసింది. వచ్చే ఏడాది కూడా రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల మేర అప్పులు చేసేలా బడ్జెట్‌లో చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు భూముల విక్రయం వంటి వాటి నుంచి రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొనవచ్చు. కాగా, రాష్ట్ర మంత్రివర్గం బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై 2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మంత్రులందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here