శాసనసభ్యుల కోటా శాసనమండలి అభ్యర్థుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించగానే.. ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు తీవ్ర ఆశాభంగం చెందారు. వీరంతా కొత్తగా ఈ పదవులు ఆశించినవారు కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన నుంచి హామీ పొందినవారే. ఆయన గద్దెనెక్కి ఇరవై నెలలు కాగా.. ఎమ్మెల్సీల భర్తీ అవకాశాలు పలు సార్లు వచ్చినా.. మాట నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డవారిని కాదని.. కొత్తగా చేరినవారికి 2019 ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చారని.. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కూడా అలా వచ్చినవారికే ఇస్తున్నారని బాధపడుతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఎవరెవరికి జగన్ హామీలిచ్చారో గుర్తుచేసుకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో స్వర్ణకార కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ టికెట్‌ను లేళ్ల అప్పిరెడ్డికే ఇస్తానని పలుసార్లు ప్రకటించినా.. చివరి నిమిషంలో ఆయన్ను మార్చి ఏసురత్నాన్ని బరిలోకి దించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పుపై అప్పిరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వారిని అనునయించి.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని రోడ్‌షోలో ప్రకటించారు. ఎమ్మెల్సీ ఖాళీలు వస్తున్నా.. ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ పోటీ చేస్తారని వైసీపీ ముఖ్య నేతలు, జగన్మోహనరెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. కానీ టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనికి టికెట్‌ను ఇచ్చారు. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవినీ ఇస్తానని ఎన్నికల ప్రచార సభలోనే జగన్ ప్రకటించారు. ఈ హామీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ప్రతిసారీ రాజశేఖర్ పేరు ప్రచారంలోకి రావడం.. అభ్యర్థుల ఖరారులో మాత్రం వెనక్కిపోవడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా అదే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలకు ముందు షేక్ ముజుబుల్ రెహమాన్ అలియాస్ పెద్దబాబుకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెడతానని జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ నెరవేర్చలేదు. ఇదే జిల్లా భీమవరానికి చెందిన కొయ్య మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ ఇస్తానని చేసిన వాగ్దానమూ నెరవేరలేదు. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటను ఇప్పటిదాకా నిలబెట్టుకోలేదు. ఇదే జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయ్‌కు, కాకినాడ మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారు. తాజా ఖాళీల్లోనూ వీరికి అవకాశం దక్కలేదు.