సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్ (రిటైరయ్యే వయసుదాకా సర్వీసులో కొనసాగే వీలు) విషయంలో తీవ్రస్థాయిలో వివక్ష జరుగుతోందని సుప్రీంకోర్టు నిశితంగా ఆక్షేపించింది. ‘‘ బబితా పునియా కేసులో మేం నిరుడు సమగ్రమైన తీర్పునిచ్చాం. క్రీడాపోటీల్లో రాణించిన వారందరినీ పర్మనెంట్ కమిషన్‌గా తీసుకోమన్నాం. కానీ బోర్డు మాత్రం వివక్ష చూపుతోంది. సాధ్యమైనంత వరకూ ఎలా తిరస్కరించాలా అనే చూస్తోంది. దీనికి ఉదాహరణ వారు పెట్టిన శారీరక దారుఢ్య, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనలు… చూస్తుంటే ఇవి పురుషుల కోసం మాత్రమే పురుషులే తయారు చేసుకున్నవి. మహిళలకు కూడా అవే నిబంధనలు ఎలా వర్తింపజేస్తారు? వయసు మీరిన మహిళలు కూడా మీరు పెట్టుకున్న రూల్స్ ప్రకారం షేప్-1 కేటగిరీలో ఉండాలని అంటే ఎలా? ఇవి ఏకపక్షం. అహేతుకం’’ అని జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దుయ్యబట్టింది.

86 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై 137 పేజీల తీర్పు వెలువరించిన బెంచ్- ఈ విషయంలో వార్షిక ఆంతరంగిక నివేదిక (ఏసీఆర్)లో ఇచ్చిన ఇవాల్యుయేషన్ విధానాన్ని తప్పుబట్టింది. ఇది ఎస్‌ఎ్‌ససీ (స్వల్ప కాలపరమితి) కింద సైన్యంలో చేరిన మహిళా ఉద్యోగులకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో చేటు చేస్తోంది. వారు సైన్యంలో మరిన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించకుండా అడ్డుపడుతోంది. ఇది ఓ క్రమానుగతమైన వివక్ష. మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు’’ అని తూర్పారబట్టింది.