రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో సగటున 62.28 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లు.. అందునా మూడు రాజధానుల ప్రాంతాల్లోని కార్పొరేషన్లలో కర్నూలు, విశాఖ, గుంటూరు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. న్యాయ రాజధాని అంటున్న కర్నూలులో అత్యల్పంగా 49.33 శాతం ఓటింగ్ నమోదైంది. 250 ఎకరాల్లో, కోట్లాది రూపాయలతో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా త్వరలోనే అభివృద్ధి చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రెండ్రోజుల కింద ప్రకటించిప్పటికీ.. ఆ నగరంలో రాష్ట్రంలోనే అతి తక్కువ పోలింగ్ నమోదవడం గమనార్హం. ఉక్కు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న, పరిపాలనా రాజధానిగా చెబుతున్న విశాఖ నగరంలో 56.01 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమరావతి పరిధిలోని గుంటూరు కార్పొరేషన్‌లో 60.80 శాతమే పోలింగ్ నమోదైంది.

విజయవాడ కార్పొరేషన్‌లో మాత్రం 63.14్ర ఓటింగ్ నమోదైంది. అనంతపురంలోనూ 56.41 శాతమే ఓటింగ్ జరిగింది. పట్టణాలు/నగర పంచాయతీల్లో మాత్రం ఓటర్లు పోటెత్తారు.కర్నూలు జిల్లాలోని గూడూరు నగర పంచాయతీలో అత్యధికంగా 85.98 శాతం, ఆదోని మున్సిపాలిటీలో అతి తక్కువగా 50.05ు మంది ఓటేశారు. మొత్తం 83 పట్టణ స్థానిక సంస్థల్లోని 77,56,200 మంది ఓటర్లలో.. 48.30,296 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. 12 నగర పాలక సంస్థల్లో సగటున 57.14 శాతం మంది మాత్రమే ఓట్లేసేందుకు ఆసక్తి చూపగా, పురపాలక సంఘాలు- నగర పంచాయతీల్లో 70.66 శాతం మంది ఓట్లేశారు!
ఏకగ్రీవాలు మినహా..
12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు- నగర పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేయగా.. 4 మున్సిపాలిటీలు (కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల) అధికార వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 12 కార్పొరేషన్లలోని 671 డివిజన్లకు గాను 91, 2,123 వార్డులకు గాను 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 580 డివిజన్లు, 1,633 వార్డులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. కార్పొరేషన్లలో మొత్తం 2,567 మంది అభ్యర్థులు రంగంలో ఉం డగా, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో మొత్తం 4,981 మంది పోటీలో నిలిచారు. 12 నగర పాలక సంస్థల్లో 48,09,173 మంది, 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 29,47,027 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కార్పొరేషన్ల పోలింగ్ శాతం(57.14)తో తో పోల్చితే మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లోని ఓటర్లలో ప్రజాస్వామిక చైతన్యం (70.66 శాతం) వెల్లివిరిసింది! మొత్తమ్మీద సగటు పోలింగ్ శాతం 62.28 కాగా.. తూర్పు గోదావరి జిల్లా (75.93) అగ్రస్థానంలో ఉంది. కర్నూలు (55.87%) అట్టడుగున ఉంది!
పట్టణాల కంటే పల్లెలే మెరుగు
స్థానిక ఎన్నికల్లో నగరాలు/పట్టణాల కంటే గ్రామ పంచాయతీలే మేలనిపించాయి. గత నెల నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగగా.. సగటున 81.78 శాతం పోలింగ్ జరిగింది. అదే పట్టణ సంస్థల్లో మాత్రం అధిక స్థానాల్లో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం 62.28 శాతం మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సొంత సీళ్లకు పార్టీలకు చాన్సు!
బుధవారం సాయంత్రం పోలింగ్ సమయం ముగియడంతో పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నిటినీ ఆయా నగరాలు, పట్టణాల్లో నిర్దేశించిన స్ట్రాంగ్ రూములున్న భవనాలకు భారీ భద్రత మధ్య తరలించారు. ఇప్పటి నుంచి ఓట్ల లెక్కింపు జరిగే ఆదివారం ఉదయం వరకూ ఈ భవంతుల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయుధ భద్రతా దళాలను ఇందుకోసం నియోగించడంతోపాటు నిరంతర పర్యవేక్షణ, పరిశీలన నిమిత్తం అన్ని చోట్లా వెబ్ కెమెరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పెట్టెల భద్రతపై వివిధ పార్టీలు అనుమానాలు, భయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. వాటిలో విశ్వాసం నింపేందుకు స్ట్రాంగ్ రూంలకు తమ స్వంత సీళ్లను వేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. 14వ తేదీ ఉదయాన అన్ని పార్టీల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలను తెరచి, బ్యాలెట్ పెట్టెలను బయటకు తెస్తామని కూడా పేర్కొంది.
4,026 కౌంటింగ్ టేబుళ్లు..
ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎస్‌ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,026 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయడంతోపాటు ఈ ప్రక్రియను చేపట్టేందుకు సుమారు 17 వేల మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ ఉద్యోగులను నియోగించనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు వేల మంది పోలీసులు, ఇతర భద్రతా బలగాలను మోహరిస్తోంది.