మెగా టోర్నీకి సన్నాహకంగా..

0
295
Spread the love

అహ్మదాబాద్‌: ఇక గంటల కొద్దీ ఓపిగ్గా క్రీజులో నిలిస్తే కుదరదు.. డిఫెన్స్‌ ఆడితే అసలుకే మోసం వస్తుంది. బంతి పడిందే ఆలస్యం బౌండరీకి తరలిపోవాల్సిందే. ఎందుకంటే.. నేటి నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నరేంద్ర మోదీ మైదానంలో ఐదు టీ20ల సిరీస్‌ ఆరంభం కానుంది. శుక్రవారమే తొలి మ్యాచ్‌. నెంబర్‌ 1-2 మధ్య జరిగే ఈ పోరు అభిమానులను అలరించనుంది. టెస్టు సిరీ్‌సను 3-1తో గెలిచిన జోరును భారత్‌ ఈ ఫార్మాట్‌లోనూ చూపాలనుకుంటోంది. అలాగే స్వదేశంలో అక్టోబరు నుంచి జరిగే టీ20 ప్రపంచక్‌పను దృష్టిలో ఉంచుకుని చక్కటి కోర్‌ గ్రూపును రూపొందించుకోవాలని చూస్తోంది. ఇక ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు పూర్తి స్థాయి ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. ఎలాగూ ఇక్కడే మెగా టోర్నీ జరుగుతుంది కాబట్టి ఈ వాతావరణానికి అలవాటు పడడం కూడా వారికి కలిసి వచ్చే విషయం. 2018, అక్టోబరు నుంచి ఈ జట్టు 21 మ్యాచ్‌లాడితే 15 గెలవగా.. భారత్‌ తన చివరి 15 మ్యాచ్‌ల్లో 13 నెగ్గడం విశేషం.

ఓపెనర్లుగా రాహుల్‌, రోహిత్‌

పొట్టి ఫార్మాట్‌లో భారత ఓపెనర్లు ఎవరనేది కెప్టెన్‌ కోహ్లీ మ్యాచ్‌కు ముందే స్పష్టం చేశాడు. ఫామ్‌లో ఉన్న రాహుల్‌, రోహిత్‌ బరిలోకి దిగుతారని, ధవన్‌ రిజర్వ్‌ ఓపెనర్‌గా ఉంటాడని అతడు స్పష్టం చేశాడు. దీంతో ఊహాగానాలకు తెర పడి నట్టయింది. అలాగే వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఆడడం కూడా ఖాయమైపోయింది. ఇక కీలకమైన నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను పరీక్షించే అవకాశం కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో అతడు మెరుగ్గా రాణించాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా, పంత్‌ రానున్నారు. బౌలింగ్‌లో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కొత్త బంతిని దీపర్‌ చాహర్‌తో పంచుకోబోతున్నాడు. నటరాజన్‌ గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి లోటుతో మరో పేసర్‌గా శార్దూల్‌, సైనీ మధ్య పోటీ ఉంది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కాగా తెవాటియాపై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో ఈ విభాగంలో చాహల్‌తో సుందర్‌ ఆడే అవకాశం ఉంది. ఊపులో ఉన్న అక్షర్‌ చేరికను కూడా కొట్టిపారేయలేం.

పటిష్ఠ జట్టుతో..

టెస్టు సిరీస్‌ మాదిరి రొటేషన్‌ పద్ధతి కాకుండా ఈ సిరీ్‌సకు ఇంగ్లండ్‌ పూర్తి బలంతో ఆడబోతోంది. జేసన్‌ రాయ్‌, బట్లర్‌ విధ్వంసకర ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సంచలన బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ తన జోరును భారత్‌లోనూ చూపాలనుకుంటున్నాడు. ఇక బెయిర్‌స్టో, స్టోక్స్‌, కెప్టెన్‌ మోర్గాన్‌తో జట్టు మిడిలార్డర్‌ అద్భుతంగా ఉంది. బౌలింగ్‌లో పేసర్లు సామ్‌ కర్రాన్‌, టామ్‌ కర్రాన్‌ మధ్య పోటీ ఉంది. ఆర్చర్‌ గాయంపై స్పష్టత లేదు. అయినా అందుబాటులో ఉంటాడని కెప్టెన్‌ ప్రకటించాడు.

జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయా్‌స/సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, సుందర్‌, భువనేశ్వర్‌, శార్దూల్‌/సైనీ, దీపక్‌ చాహర్‌, చాహల్‌.

ఇంగ్లండ్‌: రాయ్‌, బట్లర్‌, మలా న్‌, బెయిర్‌స్టో, మోర్గాన్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌, జోర్డాన్‌, ఆర్చర్‌/ఉడ్‌, రషీద్‌.

పిచ్‌, వాతావరణం

మొతేరా ట్రాక్‌ సమతూకంతో కనిపిస్తోంది. ఈ వికెట్‌పై 160 పరుగులు సవాల్‌ విసిరే స్కోరు కాగలదు. స్పిన్నర్లకు అనుకూలించనుంది. ముస్తాక్‌ అలీ టోర్నీలో ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 149 మాత్రమే.

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఇప్పటిదాకా 14 టీ20లు జరగ్గా 7-7తో సమానంగా నిలిచాయి.

కోహ్లీ మరో 72 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 17 రన్స్‌ కనుక చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 12 వేల రన్స్‌ పూర్తి చేసిన మూడో కెప్టెన్‌గా నిలుస్తాడు.

రోహిత్‌ మరో 67 పరుగులు సాధిస్తే గప్టిల్‌ (2,839)ను అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడవుతాడు.

ఈ ఫార్మాట్‌లో భారత్‌ నెంబర్‌ వన్‌ కావాలంటే ఇంగ్లండ్‌పై 4-1 లేక 5-0తో గెలవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here