మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రధాన నగరాల్లో మేయర్ అభ్యర్థుల ఖరారుపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. మేయర్ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తే.. ఎన్నికల ప్రచారంలో ఊపు వస్తుందని, నాయకులు బలంగా పనిచేస్తారని భావిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత రెండ్రోజులుగా విశాఖ, విజయవాడ, గుంటూరు నేతలతో ఈ దిశగా చర్చలు జరిపారు. మేయర్ అభ్యర్థుల ఖరారుతో పాటు కొన్ని సమస్యాత్మక డివిజన్లలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. బుధవారం విశాఖలో అక్కడి నేతలతో సమావేశమైన అచ్చెన్న.. గురువారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు, విజయవాడ నేతలతో కూడా మాట్లాడారు. అనంతరం గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర (నాని) పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. ఆయన నామినేషన్ వేసిన డివిజన్‌కు గత రెండు పర్యాయాలు టీడీపీ నుంచి స్థానిక నేత ముత్తినేని రాజేశ్ ప్రాతినిధ్యం వహించారు. కో-ఆప్షన్ ద్వారా ఆయనకు తర్వాత కార్పొరేటర్ పదవి ఇస్తామని నాయకత్వం హామీ ఇవ్వడంతో పోటీ నుంచి వైదొలగడానికి ఆయన అంగీకరించారు. మరో రెండు డివిజన్లలో పోటీ నెలకొనడంతో నేతలను శుక్రవారం పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. విజయవాడలో పార్టీ నేతల మధ్య వివాదానికి కారణమైన 39వ డివిజన్ అభ్యర్థిత్వ సమస్యను కూడా పరిష్కరించారు. అక్కడ గతంలో బీ-ఫాం ఇచ్చిన పార్టీ అభ్యర్థి పూజితను కొనసాగించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కోరారు. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ శివశర్మ అనే నేతకు ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని శివశర్మ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని అచ్చెన్న కోరగా.. వెంకన్న, నాగుల్ మీరా అంగీకరించారు. విజయవాడ, విశాఖల్లో మేయర్ అభ్యర్థిత్వాలపై కూడా కసరత్తు జరుగుతోంది. విజయవాడ కార్పొరేషన్‌కు కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు ప్రతిపాదనలో ఉంది. విజయవాడ నగరంలోని పార్టీ ముఖ్య నేతలతో సంప్రదించి దీనిపై తుది నిర్ణయానికి రావాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

విశాఖపై మంతనాలు..
విశాఖ నగరంలో కొన్ని డివిజన్లలో నెలకొన్న అంశాలపై అక్కడి నేతలతో అచ్చెన్నాయుడు చర్చించారు. విశాఖ నగరంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పార్టీ మారడంతో ఆ నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజన్లలో పార్టీ అభ్యర్థుల మార్పు అవసరమైంది. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఒక అభ్యర్థి విషయంలో సమస్య ఉండడంతో పరిష్కారంపై దృష్టి పెట్టారు. గణేశ్ నియోజకవర్గానికి తాత్కాలికంగా అచ్చెన్న, వెలగపూడి రామకృష్ణ బాధ్యులుగా వ్యవహరించాలని నిర్ణయించారు. గంటా నియోజకవర్గంలో ఆయనకు తోడుగా నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బాధ్యత అప్పగించారు. విశాఖ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. నగర నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించాలని నిశ్చయించారు.