మైలాడుదురై రైల్వేస్టేషన్ 145వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫారంలో కేక్ కట్ చేసి రైల్వే సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. ఆంగ్లేయుల ప్రభుత్వ హయాంలో అప్పటి మద్రాసు ప్రిసీడియంగా ఉన్న చెన్నై పట్టణం నుంచి విల్లుపురం, మైలాడుదురై, తిరుచ్చి, దిండుగల్, మదురై, మనియాచ్చి మీదుగా తూత్తుకుడికి అప్పటి దక్షిణ రైల్వే శాఖ రైలు మార్గం ఏర్పాటు చేసింది. మైలాడుదురై-తంజావూరు రైలుమార్గం నిర్మాణం పనులు 1877 ఫిబ్రవరి 15వ తేది పూర్తికావడంతో, ఆనాటి దక్షిణ రైల్వే శాఖ నిర్వాహకులు నిర్మించిన మీటర్ గేజ్ రైలుమార్గంలో మొట్టమొదటిసారిగా రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గం అప్పట్లో చెన్నై, దక్షిణ జిల్లాలను కలిపే ప్రధాన మార్గంగా వుండడంతో దీనిని అందరు మెయిన్ లైన్ అని పిలిచేవారు. రైలు సేవలు ప్రారంభించి మంగళవారం 145వ ఏట ప్రవేశిస్తున్న కారణంగా మైలాడుదురై జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం తరఫున సంబరాలు జరుపుకున్నారు. ఇందులో రైల్వే ఉగ్యోగులు, ప్రయాణికులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
