సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు చేపట్టిన రైల్ రోకో గురువారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల దాకా జరిగిన ఈ రోకోతో అనేక రైల్ సర్వీసులు స్తంభించాయి. ఉత్తర భారతంలో ముఖ్యంగా పంజాబ్, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల్లో ఇది సంపూర్ణంగా జరిగింది. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కాసేపు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కముందే అధికారులు రైళ్లను ఆపేశారు. ఉత్తర భారతంలో ఈ ఆందోళన కారణంగా సుమారు 45 రైళ్లను రద్దు చేయడమో, దారి మార్చడమో చేశారు. అటు కర్ణాటకలో రైలో రోకోకు మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. యశ్వంత్‌పూర్, బెంగళూరు, బెళగావి, ధార్వాడ్, దావణగెరె సెక్షన్లలో అనేక రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

‘‘రైల్ రోకోకు అపూర్వ స్పందన లభించింది. మధ్యప్రదేశ్, బిహార్, కర్ణాటక, తెలంగాణల్లో సైతం అనేకమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇది ఓ హెచ్చరిక. పోరాటాన్ని కొనసాగించాలని రైతులు పట్టుదలగా ఉన్నారు’’ అని ఆలిండియా కిసాన్ సభ ఓ ప్రకటనలో పేర్కొంది. రైల్ రోకో ఎలాంటి ప్రభావమూ చూపలేదని, అన్ని జోన్లలో రైళ్లు సాయంత్రం 4 గంటల తరువాత యథావిధిగా నడిచాయని రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.