ప్రజలను, నిరుద్యోగులను మోసం చేస్తున్న ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పట్టణ పరిధిలోని భవానీపురానికి చెందిన కోనాల అచ్చిరెడ్డి నల్లగొండ పట్టణం హనుమాన్ నగర్‌లో సామినేని సాయి ఇంటికి వెళ్లి జ్యోతిషం చెప్పాడు. ఇంట్లో బాగా లేదని, శాంతి పూజలు చేస్తేనే ఇల్లు నిలబడుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన సాయి రూ.4.35 లక్షలు ముట్టజెప్పగా అచ్చిరెడ్డి ఆ డబ్బుతో పరారయ్యాడు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో నల్లగొండ టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అచ్చిరెడ్డిని విజయవాడలో అరెస్టు చేశారు. నిందితుడు ఇంతకుముందు కూడా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో షేర్లు ఇస్తానని నమ్మించి ఆమె వద్ద రూ.50 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు.

ఖమ్మం పట్టణానికే చెందిన మరో మహిళను రైల్వేలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.25 లక్షలు, విజయవాడకు చెందిన ఓ మహిళను టీవీలో యాంకర్‌ను చేస్తానని నమ్మించి ఆమె నుంచి రూ.25 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై ఖమ్మం, విజయవాడ, నల్లగొండ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 12 కేసులు నమోదయ్యాయి. నిందితుడి కుమారుడు ఏపీలోని వైఎ్‌సఆర్‌సీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్నట్లు తెలిసింది.