యువత వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవాలి -కేటీఆర్‌

0
217
Spread the love

‘‘భూమిని నమ్ముకున్న వాడు చెడిపోలేదు అని చెబుతుంటారు. కానీ భూమిని అమ్ముకున్నవాడే సంతోషంగా ఉన్నాడు. ఈ పరిస్థితి మారాలంటే ఈ తరం కూడా వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవాలి. రైతుల కష్టాలను తెలుసుకోవాలి. అవసరమైతే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇలాంటి కథాంశంతో తీసిన ఈ చిత్రానికి చక్కని విజయాన్ని ఇచ్చి రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలియజెప్పండి’’ అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శర్వానంద్‌, ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిశోర్‌ బి దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని పెద్దలు చెబుతుంటారు. వ్యవసాయం అన్న పదంలోనే ‘వ్యయం’ ఉంది. ‘సాయం’ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు వ్యయం పెరిగిపోయి దేశంలో చాలా ప్రాంతాల్లో రైతు వ్యవసాయం చేసే స్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం నుంచి, ఇతరుల నుంచి సాయం అందడం లేదు. మా నాన్న ప్యాషనేట్‌ ఫార్మర్‌. మా ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా తలపాగా చుట్టినవారే! కానీ.. రైతులకు పెట్టుబడి పెట్టాలని ఏ నాయకుడు ఆలోచించలేదు. రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి పెట్టాలనే ఆలోచన చేసిన మొదటి వ్యక్తి కేసీఆర్‌. రైతులకు రూ.5 లక్షల ఉచిత రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం మాది. రైతులకు ఇంకా అండగా ఉంటాం. సినిమా విషయానికొస్తే.. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన షార్ట్‌ ఫిల్మ్‌ను ఫీచర్‌ ఫిల్మ్‌గా చేయడానికి ధైర్యం కావాలి. రామ్‌, గోపీ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. దర్శకుడు కిశోర్‌కి మంచి భవిష్యత్తు ఉండాలి. మంచి సినిమాలకు ఎప్పుడూ అండగా ఉంటాం. పన్ను రాయితీ విషయంలో కూడా సహకరిస్తాం’’ అని అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథే కేటీఆర్‌ను ఈ వేడుకకు వచ్చేలా చేసింది. తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకునే ఓ కొడుకు కథ ఇది. వ్యవసాయం ఎంత ముఖ్యమైనదో చెబుతున్నాం. కథ విన్నప్పుడు బాధ్యతగా భావించి ఈ సినిమా చేశా’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here