రాచకొండలో డీజిల్ దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇటీవల పోలీసులు డీజిల్ దొంగల ముఠాపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దీంతో కొంతకాలంగా నెమ్మదించిన దొంగలు మళ్లీ యధావిధిగా డీజిల్ చోరీలకు పాల్పడుతున్నారు. ట్యాంకర్లలో లోడ్ చేసిన డీజిల్‌ను దారిలో తస్కరిం చి బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు బుడిగ సాయిరామ్ గౌడ్ ముఠాను పట్టుకున్నారు. మొత్తం 9మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 805 లీటర్ల డీజిల్, రూ. 38,750 నగదు, 3 ట్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు.

చర్లపల్లి ప్రాంతానికి చెందిన బుడిగ సాయిరామ్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దివాలాతీశాడు. తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌కు మకాం మార్చాడు. చెర్లపల్లి పరిధిలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫిలింగ్ స్టేషన్ల నుంచి ఆయిల్ ట్యాంకర్లను నడుపుతున్న డ్రైవర్‌లతో సత్ససంబంధాలున్నాయి. ఆయిల్ లోడ్‌తో బయటకు వెళ్లిన తర్వాత డ్రైవర్‌ల సహకారంతో ట్యాంకర్ల నుంచి మార్గమధ్యలో డీజిల్‌ను తస్కరించేవాడు. ఒక్కో ట్యాంకర్ నుంచి 200-230లీటర్లు ఆయిల్‌ను కాజేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడు. ట్యాంకర్లకు జీపీఎస్ ఉండటంతో ఎక్కడా అనుమానం రాకుండా ఉండటానికి రన్నింగ్‌లో ఉన్న ట్యాంకర్ల నుంచి పైపు సహకారంతో క్యాన్‌లలో నింపుతారు.
ఇలా చేయడానికి సాయిరామ్‌గౌడ్ తన ముఠాలో డ్రైవర్‌లతో కలిపి మొత్తం 8మందిని చేర్చుకున్నాడు. శనివారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠా డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్నట్టు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ రవికుమార్ బృందం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆదిబట్ల పోలీసులకు అప్పగించారు.