రెండేళ్లలో కోట్లకు పడగలు!

0
244
Spread the love

‘ఇండస్‌ వివా’లో ఏజెంట్లుగా పనిచేసిన కొందరు మోసగాళ్లు.. రెండేళ్లలో కోట్లకు పడగలెత్తారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తేల్చింది. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ దందాలో దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి రూ.1,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 26 మంది నిందితుల్లో.. 24 మంది అరెస్టవ్వగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

ఈ దందాలో అమాయకులకు ఎరవేయడంలో ఏజెంట్ల పాత్ర కీలకం. వారు ఎంత మందిని చేర్పిస్తున్నారనే దానిని పరిగణనలోకి తీసుకుని, ప్రధాన నిందితుడు అభిలాష్‌ థామస్‌ అతడి మిత్రులు.. ఏజెంట్లకు స్టార్‌ డిస్ట్రిబ్యూటర్‌, రుబీ ఎగ్జిక్యూటివ్‌, బ్లాక్‌డైమండ్‌ అనే పేర్లతో ఏజెంట్లను పిలుస్తుంటారు. ఇలా ఉన్నతస్థాయి ఏజెంట్లు తెలుగు రాష్ట్రాల్లో ఐదారొందల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రెండేళ్లలోనే కోట్లకు పడగలెత్తారని పోలీసులు చెబుతున్నారు. కుల సంఘాల నేతలు, ఉపాధ్యాయులు కూడా ఏజెంట్లుగా మారి, తమ పలుకుబడితో అమాయకులకు ఎరవేశారని వివరించారు. ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా.. తమ ఉద్యోగాలకు సెలువులు పెట్టి దందా కొనసాగించారంటే.. లాభాలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. గొలుసుకట్టు స్కీములు ఎక్కడో ఒక చోట అంతమవ్వడం సహజమే. ఈ క్రమంలో చివర్లో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు కనీసం 10 వేల దాకా పోగొట్టుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

అండర్‌గ్రౌండ్‌లోకి ఏజెంట్లు

‘ఇండస్‌ వివా’ కుంభకోణం వెలుగులోకి రాగానే.. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తమ దందాను కొనసాగించిన ఏజెంట్లంతా.. ఆత్మరక్షణలో పడ్డారు. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మంది అరెస్టు కాగా.. వారిలో ఏజెంట్లు, వారి జీవిత భాగస్వాములు కూడా ఉన్నారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి, కేసులు పెట్టే అవకాశం ఉండడంతో.. ఏజెంట్ల ముసుగులో కోట్లు సంపాదించిన వారు ఇప్పుడు తప్పించుకునే దారులు వెతుక్కుంటున్నారు.

వాట్సాప్‌ గ్రూపులు బంద్‌

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ దందా సాగిందని పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ కుల సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఒక ఏజెంట్‌ ఈ కుంభకోణం బయటపడగానే.. తాను నిర్వహిస్తున్న వాట్సాప్‌ గ్రూపును తొలగించాడని పోలీసులు గుర్తించారు. సదరు ఏజెంట్‌ కొన్ని వందల మందిని ఏజెంట్లుగా చేర్చినట్లు తేల్చారు. ఈ విషయమై ఆయనను సంప్రదించగా ‘‘నేను నా అవసరాలకు ప్రాడక్ట్స్‌ను తెప్పించుకున్నాను’’ అని సమాధానమిచ్చాడు. గ్రూపును ఎందుకు తొలగించారనే ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here