‘రెగ్యులర్‌’ రైలు రాదా?

0
154
Spread the love

కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోయిన రైలు బండ్లు ఇప్పుడు మెల్లమెల్లగా పట్టాలు ఎక్కాయి. ప్యాసింజర్లు మినహా దాదాపు అన్ని ఎక్స్‌ప్రె్‌సలు నడుస్తున్నాయి. కానీ… వాటి పద్ధతి మాత్రం మారిపోయింది. రెగ్యులర్‌ రైళ్లన్నీ ‘స్పెషల్స్‌’గా మారిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టినా… రెగ్యులర్‌ సర్వీసులను ప్రవేశపెట్టడంలేదు. దీంతో ప్రయాణికులకు రకరకాల కష్టాలు తప్పడం లేదు!

రాయితీల్లేవు..

స్పెషల్‌ రైళ్ల పేరుతో దాదాపుగా అన్ని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులనే నడుపుతున్నారు. వీటిలో ప్రయాణికులకు సాధారణ రైళ్లలో లభించే రాయితీలేవీ వర్తించటం లేదు. స్వాతంత్య్ర సమరయోధులు, వయో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు… ఇలా అనేక వర్గాల వారికి రాయితీలు దూరమయ్యాయి. ఎవరైనా సరే… ‘ఫుల్‌’ టికెట్‌ కొనాల్సిందే!

తత్కాల్‌ స్థాయి..

స్పెషల్‌ రైళ్లలోనూ కొన్ని ‘మరింత స్పెషల్‌’ రైళ్లు ఉన్నాయి. ఫెస్టివల్‌ స్పెషల్‌, వారాంతాలు, కొన్ని దూరప్రాంత రైళ్లలో చార్జీలను తత్కాల్‌ స్థాయిలో వసూలు చేస్తున్నారు. అంటే… సాధారణ టికెట్‌కు దాదాపు రెట్టింపు ధర! ఉదాహరణకు… విజయవాడ నుంచి నెల్లూరుకు స్లీపర్‌ టికెట్‌ స్పెషల్‌ రైళ్లలో రూ.200 మాత్రమే. అదే… ఫెస్టివల్‌ స్పెషల్‌, వారాంతపు స్పెషల్‌ రైళ్లలో మాత్రం ఏకంగా రూ.385 వసూలు చేస్తున్నారు. ఇది భారీ బాదుడు అని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్యాసింజర్లు ఎప్పుడు?

ఎక్స్‌ప్రె్‌సలను మాత్రమే పట్టాలెక్కించిన భారతీయ రైల్వే… ప్యాసింజర్లను విస్మరించింది. ఎక్స్‌ప్రె్‌సలలాగానే… ప్యాసింజర్లను కూడా పూర్తి రిజర్వుడు బోగీలతో నడిపే అవకాశమున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. దీనివల్ల రైల్వే ప్రయాణం పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికులకు భారంగా మారింది.

తిరిగి బస్సుబాట!

సాధారణ చార్జీలకంటే రైళ్లలో రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేయటం… ప్యాసింజర్‌ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు బస్సుబాట పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విజయవాడ నుంచి ఉత్తరాంధ్రకు రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సులు ఈ కారణంగానే నడిచాయని చెబుతున్నారు.

సీజనల్‌ టికెట్‌ ‘కట్‌’

‘స్పెషల్స్‌’ పేరిట నడుస్తున్న రైళ్లలో జనరల్‌ బోగీలను ఎత్తేశారు. ఈ బోగీలను ‘సెకండ్‌ సిట్టింగ్‌’గా మార్చి, రిజర్వేషన్‌ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో జనరల్‌ బోగీల్లో లెక్కలేనంతమంది ఎక్కకుండా నియంత్రించడం మంచిదే! కానీ… వందలమంది ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఉపయోగించుకునే సీజనల్‌ టికెట్‌ ప్రయాణికులకు ఇప్పుడు రైల్వే దూరమైంది.

అందుకే బాదేస్తున్నారు..

‘‘ప్రైవేటు సంస్థల కోసం రైళ్ల సమయాలను మార్చారు. ప్రైవేటు రైళ్లలో చార్జీల భారాన్ని ముందునుంచే ప్రజలకు అలవాటు చేస్తే తప్ప .. వాటిని ఆదరించలేరన్న ఉద్దేశ్యంతోనే స్పెషల్‌ రైళ్లను ప్రారంభించారు. తత్కాల్‌ చార్జీతో వీకెండ్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ , ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ వంటివి కొనసాగిస్తున్నారు’’ – జీఎన్‌ శ్రీనివాసరావు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డివిజన్‌ కార్యదర్శి.

ఇది పెద్ద కుట్ర

‘‘రైళ్లను ప్రైవేటుపరం చే యాలన్న ఆలోచనను చాలా వేగంగా అమలు చేయటానికి కరోనా కలిసొచ్చింది. ఇప్పటికే రైల్వే సగభాగం ప్రైవేటీకరణబాటలోకి వెళ్లిపోయింది. అతి ముఖ్యమైన ఆపరేషన్ల విభాగంలో కూడా ప్రైవేటీకరణను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానంలో జోన్‌ పరిధిలో ఎంపిక చేసిన రూట్లలో డిమాండ్‌ ఉన్న రైళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు బిడ్లను కూడా పిలిచారు. ఇదొక పెద్ద కుట్ర. ప్రైవేటు పరం చేయటానికి రైల్వేను సామాన్య, మధ్య తరగతి వర్గాలకు దూరం చేయటం బాధాకరం. సామాన్యుల కోసం రైళ్లను నడిపితే అర్థం ఉంటుంది. రైల్వే ద్వారా ఏటా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నాం!’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here