గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీని అడ్డుకొనే ఆలోచన లేదని హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) తెలిపింది. వైసీపీ రంగులతో ఉన్న వాహనాలకు తటస్థ రంగులు వేసి పరిశీలనకు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించినట్లు పేర్కొంది. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. వైసీపీ రంగులతో ఉన్న మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కుదరదని, తటస్థ రంగులు వేసి తమ పరిశీలనకు తీసుకురావాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై పౌరసరఫరాల శాఖ కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ తరఫు వాదనల కోసం ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ….‘పట్టణ ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీని నిలువరించలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగులపై ఫిర్యాదులు అందాయి. వాటికి తటస్థ రంగులు వేసి ఎస్‌ఈసీ పరిశీలనకు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించాం.

ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోలేదు. వాహనాలపై సీఎం, మాజీ సీ ఎం బొమ్మలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కేవలం ముఖ్యమంత్రి బొమ్మను మాత్రమే అనుమతించింది. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉంది. పథకం అమలును నిలువరించే ఉద్దేశం ఎస్‌ఈసీకి లేదు. వాహనాలకు తటస్థ రంగులు వేస్తే అనుమతించే అంశాన్ని పరిశీలిస్తాం. ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోకముందే ఈ వ్యవహారంలో న్యాయసమీక్ష సరికాదు’ అని వివరించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ… ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే వాహనాలు ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న పథకానికి కొనసాగిపుగానే వాహనాలు ప్రవేశపెట్టామన్నారు. ఏడు వేల వాహనాలకు రంగులు వేయడానికి 2నెలల సమయం పడుతుందన్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని… రంగులు మార్చడం సాధ్యం కాదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని రేషన్ పంపిణీని అనుమతించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులు తీర్పును రిజర్వ్ చేశారు.