రేషన్‌ బండెక్కడ!

0
155
Spread the love

రేషన్‌ డోర్‌ డెలివరీ విధానంతో డీలర్లు నలిగిపోతున్నారు. అటు వాహన డ్రైవర్లకు, ఇటు కార్డుదారులకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు. సరుకులు ఇచ్చే వాహనం రావడం ఆలస్యమైతే కార్డుదారులు రేషన్‌ దుకాణానికి క్యూ కడుతున్నారు. అక్కడే తమకు సరుకులు ఇవ్వాలని వారు కోరడం డీలర్లకు సమస్యగా మారుతోంది. దీంతో రేషన్‌ ఇచ్చే వాహనం కోసం కార్డుదారులతో పాటు ఇప్పుడు డీలర్లు కూడా ఎదురుచూడాల్సి వస్తోంది. షాపు నుంచి సరుకులు తీసుకెళ్లి త్వరగా పంపిణీ చేయాలంటూ వాహనాల డ్రైవర్లను కోరుతున్నారు. కార్డుదారులు సరుకుల కోసం ఒత్తిడి చేస్తూ తమను బతకనివ్వడం లేదని వాపోతున్నారు. అయినా డ్రైవర్లు మాత్రం తాపీగా వ్యవహరిస్తుండటంతో ఈ నెలలో ఇప్పటివరకూ 42శాతం పంపిణీ మాత్రమే జరిగింది. దాదాపు నెలలో సగం రోజులు గడిచినా కార్డుదారులు సరుకుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కార్డులుండ గా ఇప్పటికి కేవలం 62లక్షల కార్డులకు మాత్రమే సరుకులు అందాయి. ఈ నెల రేషన్‌ పంపిణీ పట్టణాల్లో 1న, గ్రామాల్లో 6న ప్రారంభమైంది. ముందుగా ప్రారంభమైన పట్టణాల్లోనూ పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు.

డీలర్లపై ఒత్తిళ్లు

ఒక్కో వాహనం రోజుకు గరిష్ఠంగా 90 కార్డులకు రేషన్‌ పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్దేశించింది. కనీసం 80 కార్డులకు ఇస్తే కనీసం 20 రోజుల్లో అయినా పంపిణీ పూర్తవుతుంది. కానీ వాహనాలు ఆ స్థాయిలో పంపిణీ చేయలేకపోతున్నాయి. ఉదయం 7గంటలకు పంపిణీ ప్రారంభించిన తర్వాత ఒకసారి సర్వర్‌ ఆగిపోయిన వెంటనే డ్రైవర్లు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఆ పూటకు రేషన్‌ పంపిణీని ఆపేస్తున్నారు. మళ్లీ సాయంత్రం కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ఇక ఆ రోజుకు పంపిణీ ముగిసిపోతోంది. ఇలా కొన్ని వాహనాలు చాలా రోజుల్లో పట్టుమని పది కార్డులకు కూడా సరుకులు ఇవ్వడం లేదు. దీంతో రోజుల తరబడి ఎదురుచూసిన కార్డుదారులు రేషన్‌ షాపులకు వెళ్తున్నారు. వీఆర్‌వో లాగిన్‌తో డీలర్లు కూడా రేషన్‌ ఇచ్చే వీలుంది. అయితే ఒకరిద్దరికి సరుకులు ఇస్తే మిగిలిపోయిన వారంతా షాపు వద్దకు వస్తున్నారు. ఇది డోర్‌ డెలివరీ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని భావిస్తున్న డీలర్లు ఎవరికీ సరుకులు ఇవ్వడం లేదు. దీంతో డీలర్లు, కార్డుదారుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. వాహనమూ రాక, షాపులోనూ ఇవ్వకపోతే ఎలాగంటూ కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. పంపిణీ బాధ్యత తమది కాదని చెబుతున్నా వారు వినడం లేదంటూ డీలర్లు వాపోతున్నారు.

పంపిణీ సగమే

ఒక్కో వాహనం పరిధిలో సగటున రెండు, మూడు గ్రామాలున్నాయి. అయితే చాలా గ్రామాల్లో రెండేసి రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాహనదారులు వాటిలో ఏదో ఒక దుకాణం పరిధిలోని కార్డులకు పంపిణీ చేసి పక్క గ్రామానికి వెళ్లిపోతున్నారు. అక్కడే ఉన్న రెండో షాపు కార్డుదారులకు కొన్ని రోజులు ఆగాలని సూచిస్తున్నారు. అలా వదిలేస్తే కార్డుదారులే షాపులకు వెళ్తారని, వారికి డీలర్లు సరుకులు ఇస్తే ఇక తమకు సమస్య ఉండదని కొందరు డ్రైవర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక గ్రామంలో సగంమందికి రేషన్‌ అంది, మిగిలినవారికి రాకపోవడంతో ప్రజలు షాపులకు వెళ్తున్నారు. ఇది డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. సరుకులు వాహనం ద్వారా ఇచ్చినా, డీలర్లు ఇచ్చినా డ్రైవర్లకు ఇచ్చే వేతనాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే సగం పని డీలర్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here