రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం సాధ్యమైనంతమేర కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని బుధవారానికి ఈమేరకు వరుస ట్వీట్లు చేశారు. నీటి పారుదల సౌకర్యాలు పెంచడం, రైతులకు పంట రుణాలు, బీమా అందజేయడం, నేలల్ని సారవంతం చేయడం, మధ్యవర్తులను తొలగించడం లాంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. పీఎం-కిసాన్ యోజన కింద చిన్నతరహా రైతులకు పెట్టుబడి రూపంలో ఏటా కేంద్రం రూ. 6 వేలను మూడు దఫాలుగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతిపాదనపై స్పందిస్తే చర్చలకు సిద్ధమే: తోమర్
వ్యవసాయ చట్టాల అమలు అంశంలో కేంద్ర ప్రతిపాదనలపై స్పందించే పక్షంలో రైతు సంఘాలతో చర్చల పునరుద్ధరణకు తాము సిద్ధమేనని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. రైతు సంఘాలు అంగీకరిస్తే.. ఒకటిన్నర సంవత్సరాల పాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని, ఓ సంయుక్త సంఘాన్ని నియమించి.. రైతుల అపోహలను తొలగిస్తామని తెలిపారు. అప్పటివరకు వారు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు.