భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. మహాత్మ గాంధీ దండి యాత్రను గుర్తు చేస్తూ చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి నవ్‌సారీలోని దండి వరకూ 386 కిలోమీటర్ల మేర 81 మంది ఇందులో పాల్గొంటున్నారు. పాదయాత్ర 25 రోజులపాటు కొనసాగి ఏప్రిల్ ఐదో తేదీన ముగియనుంది. నిజానికి, ఉప్పుపై బ్రిటిష్ పాలకులు పన్ను వేసినందుకు నిరసనగా మహాత్మా గాంధీ 1930 మార్చి 12వ తేదీన ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆయన నాయకత్వంలో 78 మంది దండి మార్చ్ కొనసాగించారు.

ఉత్సవాలను ప్రారంభించడానికి ముందు.. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది జాతిపితకు, సమరయోధులకు మనమిచ్చే అద్భుత నివాళి అని, స్థానిక ఉత్పత్తిని దేనినైనా కొని సోషల్ మీడియాలో పోస్టు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘సబర్మతి ఆశ్రయంలోని మగన్ నివాస్ వద్ద చర్ఖాను ఏర్పాటు చేస్తారు. ఆత్మనిర్భర్ భారత్‌కు సంబంధించి చేసే ఒక్కో ట్వీట్‌కు అది పూర్తిగా ఒకసారి తిరుగుతుంది. ప్రజా ఉద్యమానికి ఇది ఉత్ర్పేరకంగా పని చేస్తుంది’’ అని మోదీ ట్వీటారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడారు. 2023 ఆగస్టు 15వతేదీ వరకూ ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో గుర్తింపునకు నోచుకోని వీరుల చరిత్రను భద్రపరచడానికి ఆరేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశామన్నా రు. ‘మన రాజ్యాంగం, మన ప్రజాస్వామిక సంప్రదాయాలు మనకు గర్వకారణం. భారతదేశం ప్రజాస్వామ్య మాతృక. దాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాం. మనం సాధించిన ఘనతలు మొత్తం ప్రపంచానికే వెలుగునిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి భారత్ చేపట్టిన ఆత్మనిర్భర్ వైఖరి ప్రపంచ అభివృద్ధి పయనానికి కొత్త ఉరవడిని ఇస్తుందన్నా రు.
స్వాతంత్య్ర పోరాటం, ఆలోచనలుః75; ఘనతలుః75; చర్యలుః75; నిర్ణయాలుః75 అనే ఐదు స్తంభాలూ మనం ముందుకు సాగడానికి చోదక శక్తులని వివరించారు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాం తంలో స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన ఘట్టాలను భద్రపరచడానికి ఆరేళ్లుగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘దండి యాత్రతో సం బంధం ఉన్న స్థలాన్ని రెండేళ్ల కిందటే పునరుద్ధరించాం. దేశంలో ప్రప్రథమ స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అండమాన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రదేశాన్ని పునరుద్ధరించాం. అండమాన్ నికోబార్ దీవులకు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం కలిగిన పేర్లు పెట్టాం. అంబేడ్కర్‌తో అనుబంధం కలిగిన ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశాం. జలియన్ వాలాబాగ్, పైకా ఉద్యమ స్మారకాలను అభివృద్ధి చేశాం’’ అని వివరించారు. అంతకుముందు సబర్మతి ఆశ్రమంలో గాంధీకి మోదీ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామం, స్వాతంత్య్ర సమరయోధులకు ఈ మహోత్సవ్ ఓ నివాళి అని విజిటర్స్ పుస్తకంలో రాశారు. ఇక్కడి నుంచే మహాత్మ గాంధీ ఆత్మ నిర్భరత(స్వయంసమృద్ధి), ఆత్మ విశ్వాసానికి సంబంధించిన సందేశాలను ఇచ్చారని గుర్తు చేశారు. బాపూ ఆశీస్సులతో, భారతీయులమంతా తమ విధులను పాటిస్తూనే అమృత్ మ హోత్సవ్ పెట్టుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తామన్న విశ్వాసం ఉందని విజిటర్స్ పుస్తకంలో రాశారు.
పేదరికం, అవినీతి, సామాజిక దురాచారాల నిర్మూలనే నివాళి: వెంకయ్య
ఆర్థికంగా బలమైన భారతదేశాన్ని నిర్మించాలంటే పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఉమ్మడిగా ప్రయత్నాలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇదే అసలైన నివాళి అని అభివర్ణించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా శుక్రవారం ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. భారత ప్రయాణంలో ఇదో నిర్ణయాత్మక దశ అని, మహాత్మాగాంధీ, ఎందరో సమరయోధులు మనకు అందించిన వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇదొక అవకాశమని వ్యా ఖ్యానించారు. దండి మార్చ్ అప్పట్లో దేశం మొత్తాన్ని జాగృతం చేసిందంటూ ఉప్పు సత్యాగ్రహాన్ని గుర్తు చేసుకున్నారు.