లోక కల్యాణం కోసం అఖండ భారత్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మంతోనే ఆ కల సాధ్యమవుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి పాకిస్థాన్ వంటి దేశాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ ‘విశ్వభారతం’ పేరిట సంస్కృతంలో రచించిన పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లో ఖానామేట్‌లోని సరస్వతి పీఠంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘ఒకప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండి, వేరైన దేశాలు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకప్పటి గాంధార దేశం అఫ్ఘానిస్థాన్‌గా మారింది. అక్కడ శాంతి ఉందా? పాకిస్థాన్ ప్రశాంతంగా ఉందా? భారత్ నుంచి విడిపోయిన దేశాలేవీ ప్రశాంతంగా మనుగడ సాగించడం లేదు. ఆ దేశాలు కష్టాల నుంచి బయట పడాలంటే తిరిగి భారత్‌లో ఏకం కావాలి. ఇది బలవంతంగా జరగరాదు. మానవ ధర్మం (హిందూ ధర్మం) ప్రకారం జరగాలి’’ అని భాగవత్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత విశ్వవిద్యాలయ మాజీ డీన్ రాణీ సదాశివమూర్తి, పద్మశ్రీ రమాకాంత్‌శుక్లా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో భాగవత్‌కు జెడ్ ప్లస్-2 భద్రత
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ గురువారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలో బసచేశారు. దీంతో పోలీసులు జెడ్ ప్లస్-2 కేటగిరి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే కార్యక్రమంలో భాగవత్ పాల్గొననున్నారు.