భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏప్రిల్ 5 నుంచి మూడు రోజుల పాటు సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం నిర్ణయాలను ఏప్రిల్ 7న వెల్లడించనున్నారు. ఈ సారి సమావేశంలో కూడా ఎంపీసీ.. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది మే 22న ఆర్‌బీఐ అనూహ్యంగా రెపో రేటును గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయి 4 శాతానికి కుదించింది. కొవిడ్ నేపథ్యంలో డిమాండ్‌కు ఊతం ఇచ్చేందుకు ఈ చర్య తీసుకున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రెపో రేటు కొనసాగుతోంది.

వృద్ధికి తోడ్పాటునిచ్చే లక్ష్యంతో: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే వృద్దికి తోడ్పడడం ద్రవ్య, పరపతి విధానం లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్ మొదటి నుంచి చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్య్లోణం అదుపులోనే ఉంది. అయితే జీడీపీలో ప్రధాన వాటాదారులైన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కొవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది. దీంతో ఏప్రిల్ 7న ప్రకటించే పరపతి, ద్రవ్య విధాన పాలసీలోనూ ఆర్‌బీఐ కీలక రెపో రేట్ల జోలికి పోకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. వృద్ధి రేటు పూర్తిగా గాడిన పడే వరకు ‘సర్దుబాటు’ పరపతి విధానమే కొనసాగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ ఇప్పటికే అనేక సార్లు సంకేతాలు ఇచ్చారు. కొవిడ్ ఒక కొలిక్కి వచ్చే వరకు వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయని మార్కెట్ వర్గాలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి.
31న బ్యాంకుల్లో ప్రభుత్వ ఖాతాల క్లియరెన్స్
ఈ నెల 31న దేశంలోని బ్యాంకులన్నీ ప్రభుత్వ వార్షిక ఖాతాల లావాదేవీల ముగింపు క్లియరెన్స్‌లో నిమగ్నమవుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తమ ద్వారా జరిగిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లావాదేవీల ఖాతాల ముగింపు తుది వివరాలను బ్యాంకులు వచ్చే బుధవారం క్లియర్ చేస్తాయి. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ, రాష్ట్ర సహకార, పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఏటా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31) బ్యాంకులు ఈ పని చేస్తుంటాయి. ఇందులో భాగంగా వచ్చే బుధవారం ముంబై, చెన్నై, ఢిల్లీల్లోని చెక్ ట్రంకేటెడ్ సిస్టమ్ (సీటీఎస్) గ్రిడ్ల ద్వారా సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు ప్రభుత్వ చెక్కుల ప్రజెంటేషన్ క్లియరింగ్, రాత్రి ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య రిటర్న్ క్లియరింగ్ చేస్తాయి. ఆ రోజు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలూ రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.