డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆలనా పాలనా కరువైంది.

రెండున్నరేళ్లుగా పూర్తిస్థాయి వైస్‌చాన్స్‌లర్ (వీసీ) లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. వర్సిటీకి ఇన్‌చార్జి వీసిని నియమించినా.. ఉపయోగం లేకుండాపోయింది. పాలన పూర్తిగా గాడితప్పటంతో ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసీల పదవీకాలం పూర్తవడంతో రాష్ట్రంలోని 9 వర్సిటీలకు గత రెండున్నరేళ్లుగా ఇన్‌చార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు కొనసాగు తున్నారు. వారి శాఖల్లో ఎంతగా నిమగ్నమైనప్పటికీ.. వర్సిటీ పాలనా వ్యవహారాలు సజావుగా సాగేలా అధికారులు సమయం కేటాయిస్తున్నారు. వర్సిటీకి రాకపోయినా.. అధికారులను పిలిపించి సమీక్షలు నిర్వహించడం, సమస్యలను అడిగి తెలుసుకోవడం చేస్తున్నారు. కానీ అంబేడ్కర్ వర్సిటీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దీనికి ఇన్‌చార్జి వీసీగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పార్థసారఽథి గతేడాది ఏప్రిల్ వరకు కొనసాగారు. ఆయన పదవీ విరమణ అనంతరం జూన్‌లో ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌ను ఇన్‌చార్జి వీసీగా నియమించింది. పేరుకు వీసీ ఉన్నట్టే కానీ.. ఆయన ఇంతవరకు వర్సిటీలో అడుగే పెట్టలేదు. లాక్‌డౌన్ సమయంలో ప్రవేశాలకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పరీక్షలు, ఫలితాలకు సంబంధించి నిత్యం విద్యార్థులు వర్సిటీని సంప్రదిస్తున్నా.. కనీసం సమాధానం చెప్పేవారే కరువయ్యారు. విద్యార్థులకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని వర్సి టీ ఉన్నతాధికారులు ఆరు నెలలుగా చెబుతున్నా.. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వేలాది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పుస్తకాల పంపిణీ ఉంటుందా?
వర్సిటీలో ప్రతి ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో సెమిస్టర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. ప్రతిసారి సెమిస్టర్ ప్రారంభంలోనే పుస్తకాలను వర్సిటీ ప్రచురించి అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. ఈసారి ఏప్రిల్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. బీఏ, బీకాం, బీఎస్సీ గ్రూపులకు కలిపి ప్రథమ సంవత్సరంలో మొత్తం 40,197 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ పుస్తకాల పంపిణీ ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా.. ఇంతవరకు కనీసం పుస్తకాల ప్రచురణే ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన పాలనా అనుమతులను ఇన్‌చార్జి వీసీ ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈసారి పుస్తకాల ప్రచురణ నిలిపివేసి, సాఫ్ట్ కాపీలను విద్యార్థుల ఈ-మెయిల్స్‌కి పంపాలని ఇన్‌చార్జి వీసీ భావిస్తుండగా.. ఆయన నిర్ణయాన్ని వర్సిటీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల పేరిట విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు. ఇక్కడి మొత్తం విద్యార్థుల్లో దాదాపు 80ు గ్రామీణ నేపథ్యం కలిగిన పేదలే ఉన్నారు. పుస్తకాలు అందించకుంటే చదువుపై ఆసక్తి ఉండదని, ఈ-మెయిల్ ద్వారా అందిన సాఫ్ట్‌కాపీల ప్రింట్ తీసుకోవాలన్నా రూ. 2-3 వేల ఖర్చవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
యూజీసీ నిబంధనలూ బేఖాతరు
1982లో ప్రారంభించిన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ ఇంతవరకు న్యాక్ గుర్తింపు కూడా లేదు. దీనికి దరఖాస్తు చేయాలంటే పాలనాపరమైన అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. న్యాక్ గుర్తింపు ఉంటే.. విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రత్యేక నిధులనూ విడుదల చేస్తుంది. ఓపెన్ వర్సిటీలన్నీ విధిగా విద్యార్థులకు పుస్తకాలు ప్రచురించి ఇవ్వాలని యూజీసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 7 నెలలుగా పుస్తకాల ప్రచురణ జరగలేదన్న విషయం యూజీసీ దృష్టికి వెళ్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందని వర్సిటీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి వీసీని నియమించడంలో మరింత జాప్యం చేస్తే.. అంబేడ్కర్ వర్సిటీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.