సరిగ్గా ఐదు నెలల తర్వాత విజయవాడ నగరంలో మందు దుకాణాల ముందుకు మద్యం బాబులు వచ్చారు. నగరంలో శనివారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. క్లస్టర్, కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న షాపులను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 22 నుంచి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు మూతబడ్డాయి. మే నెలలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో షాపులు తెరుచుకున్నాయి.
లాక్‌డౌన్ నుంచి నేటి వరకు నగరంలోని ఏ మద్యం దుకాణం షెట్టర్ ఎత్తలేదు. నగరంలోని మద్యం దుకాణాలు రెండు డిపోల పరిధిలో ఉంటాయి. గొల్లపూడి డిపో పరిధిలో 16 మద్యం దుకాణాలు ఉండగా, నిడమానూరు డిపో పరిధిలో 33 షాపులు వెరసి 49 దుకాణాలు ఉన్నాయి. వాటిలో నిడమానూరు డిపో పరిధిలో 20 షాపులను, గొల్లపూడి డివో పరిధిలోని 16 షాపులను తెరవడానికి ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేశారు. నిడమానూరు డిపో పరిధిలోని కొన్ని శుక్రవారం సాయంత్రమే తెరుచుకున్నాయి. వాటి వద్ద మందుబాబులు గుమికూడి కనిపించారు.