ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా… ఆ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే దానిపై చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం ఆమె కిషన్ రెడ్డితో చర్చ జరపడం.. ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే విజయశాంతితో చర్చించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఆమె కాంగ్రెస్‌లో ఉంటారని చెప్పి ఈ రూమర్స్‌కు చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతిపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆమె బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ మొదలైంది.
విజయశాంతిపై పొడగ్తలు కురిపించిన బండి సంజయ్… ఆమె ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని కొనియాడారు. తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికల తరువాత విజయశాంతి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో బండి సంజయ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌పై సోషల్ మీడియా వేదికగా విజయశాంతి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ సెటైర్లు వేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ… ప్రజలు దుబ్బాకలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజయశాంతి కోరకపోవడం గమనార్హం. మరోవైపు సిద్ధిపేటలో బండి సంజయ్ అరెస్ట్ ఘటనను విజయశాంతి తీవ్రంగా ఖండించారు. మొత్తానికి విజయశాంతి తీరు, ఆమెపై బీజేపీ నేత పొడగ్తలను బట్టి చూస్తుంటే… దుబ్బాక ఉప ఎన్నికల తరువాత రాములమ్మ ఎప్పుడైనా బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందనే ప్రచారం మరోసారి మొదలైంది.