హైదరాబాద్: వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్క్ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను బ్యాంకింగ్ పర్సోనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. మెయిన్స్ పరీక్ష ఈ నెల 28న జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కులనుబట్టి ప్రొవిజన్ అలాట్‌మెంట్ చేస్తారు. మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 1న వెలువడే అవకాశం ఉన్నది. క్లర్క్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ ఇప్పటికే విడుదల చేసింది.

మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. ఈ ఆన్‌లైన్ పరీక్షను 2 గంటల 40 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. పరీక్షలో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. అదేవిధంగా జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. దీనికి 40 మార్కులు ఉంటాయి. ఈ రెండింటికి 35 నిమిషాల చొప్పున కేటాయించారు. ఇక రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (60 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు) అడుగుతారు. ఈ విభాగాలకు 45 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. మొత్తంగా 160 నిమిషాల్లో పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది.