ఇక నుంచి విమాన ప్రయాణం మరింత భారంకానుంది. దేశీయ విమాన టికెట్ల ధర కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను కేంద్ర పౌర విమాయాన మంత్రిత్వ శాఖ 10 శాతం నుంచి 30 శాతం వరకు గురువారం పెంచింది. ఈ కొత్త పరిమితులు వచ్చే మార్చి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు అమల్లో ఉండనున్నాయని మంత్రిత్వ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. గత ఏడాది మే 21న దే శీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన సందర్భంగా మంత్రిత్వ శాఖ విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించింది. విమాన ప్రయాణ కాలాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించింది. ధరల పెరుగుదల వలన విమాన ప్రయాణికులపై భారం అధికంగా ఉండనుంది. విమానయాన కంపెనీలు తమ టికెట్లలో కనీసం 40 శాతం టికెట్లు కనిష్ఠ, గరిష్ఠ పరిమితిలోని సగటు ధరకన్నా తక్కువకు విక్రయించాలని గత మే 21న డీజీసీఏ వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ పూర్తి సామర్థ్యంలో 80 శాతం విమానాలు మాత్రమే నడపాలని స్పష్టం చేసింది.

20 దేశాల ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు
స్వదేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో 20 దేశాలకు చెందిన ప్రయాణికులపై సౌదీ అరేబియా ఆంక్షలు విధించింది. వీటిలో భారత్ కూడా ఉంది. భారత ప్రయాణికులు నిషేధిత దేశాల మీదుగా ప్రయాణించి సౌదీకి రావొద్దని భారత ఎంబసీ సూచించింది.