శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.
“విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాష్ట్ర ప్రజలందరూ గొంతెత్తి ప్రజా ఉద్యమంతో పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలను తక్షణమే ఆపాలని ఆంధ్రప్రదేశ్ పశు వైద్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పర సొట్ట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఈరోజు తిరుపతి లో పశువైద్యవిశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 64గ్రామాల పరిధిలో 22వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ ఉందన్నారు. అనేక పోరాటాలు చేసి 32మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని, వారి ప్రాణత్యాగాల ఫలితం ప్రస్తుతం వేలాదిమంది ఉద్యోగులు ,కార్మికులు ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తుండడం దారుణమన్నారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు , కార్మిక ,ప్రజాసంఘాలతో యూనివర్సిటీలు వేదికగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇలా ప్రభుత్వం రంగం సంస్థలు ప్రయివేటీకరణ వలన బడుగు బలహీన పేద ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని కొత్త ఉద్యోగాలు ఇవ్వక పోగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిరుద్యోగం ఇంకా పెరిగిపోతుందని తెలిపారు.