విశాఖ ఉక్కు ప్రజల సెంటిమెంట్‌

0
152
Spread the love

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారు సోమవారమిక్కడ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ కొన్ని ప్రతిపాదనలతో మూడు పేజీల వినతి పత్రం సమర్పించారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మ్లాడుతూ.. బీజేపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తుందన్నారు. స్టీల్‌ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు.

దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తెచ్చామన్నారు. ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయంతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరస్థితులు, వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో బ్యాంకులను నష్టాల బారినుంచి గట్టెక్కించేందుకు విలీనం చేసినట్టే విశాఖ స్టీల్‌ ప్లాంటును కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరామని చెప్పామన్నారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు వీలుగా మంత్రి దృష్టికి కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్లామన్నారు. ఎన్‌ఎండీసీ లేదా సెయిల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో విశాఖ స్టీల్‌ ప్లాంటును విలీనం చేసే అంశంపై మంత్రితో చర్చించామన్నారు. నష్టాల భర్తీ కోసం ఐపీవో ద్వారా నిధుల సేకరణ చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే హామీ లేని రుణాల సేకరణ కోసం ప్రభుత్వ బాండ్లు జారీ చేయాలని సూచించినట్టు పురందేశ్వరి చె ప్పారు. ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆమె చెప్పా రు. అలాగే మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.4,950కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ ప్లాంటు విలువ ఇపుడు రూ.43,099 కోట్లకు పెరిగిందని, దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.8565 కోట్లు ఆదాయం సమకూరుతోందని వినతి పత్రంలో మంత్రికి వివరించామని తెలిపారు.

అమిత్‌షాతో సోము, పురందేశ్వరి భేటీ నేడు

ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు, దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రెడ్డి తదిరులు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, రాజకీయపక్షాల ఆందోళనలతోపాటు రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సోము, పురందేశ్వరి ఫోన్లో మాట్లాడారు. మంగళవారం స్వయంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వినతి పత్రం అందించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు, అవకాశం లభిస్తే ప్రధానిని కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here