ప్రైవేటీకరణకు ముందే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్)తన ఆస్తులను సొమ్ము చేసుకుంటోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని మద్దెలపాలెం వద్ద సంస్థకు ఉన్న 22.19 ఎకరాల స్థలంలో వాణిజ్య, గృహ సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ రంగంలోని ఎన్‌బీసీసీ లిమిటెడ్‌తో ఆర్‌ఐఎన్‌ఎల్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రాజెక్టు అంచనా లేదా ఆమోదిత వ్యయం లేదా వాస్తవ వ్యయంలో ఏది తక్కువైతే అందులో ఏడు శాతం ఎన్‌బీసీసీకి కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లిస్తారు. దీనికి తోడు ఈ స్థలంలో అభివృద్ధి చేసే వాణిజ్య, నివాస గృహాల అమ్మకం ధరలో ఒక శాతం మార్కెటింగ్ ఫీజుగా లభిస్తుందని ఎన్‌బీసీసీ లిమిటెడ్ తెలిపింది. ప్రాజెక్టు సవివర నివేదిక అందిన తర్వాత ఈ ప్రాజెక్టు విలువను ఖరారు చేస్తారు.
