హైదరాబాద్/చాదర్‌ఘాట్ : వృద్ధురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన వ్యక్తిని, అతడికి సహకరించిన యువతిని మలక్‌పేట క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తూర్పు మండలం జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం…. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం, పందిళ్ల గ్రామానికి చెందిన టండ్రా రాజేష్ (26) పాత నేరస్థుడు. మలక్‌పేట ఆంధ్రాబ్యాంక్ కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న రిటైర్డ్ ఇంజనీర్ భార్య పద్మావతి(74) ఇంట్లో యాదగిరిగుట్ట జిల్లాకు చెందిన రజినీ అద్దెకుంటోంది. ఆమెతో రాజేష్‌కు ఉన్న పరిచయం ప్రేమకు దారితీసింది. రజినీ, రాజేష్ కలసి చోరీకి పథకం వేశారు.

గతనెల జనవరి 29న ఒంటరిగా ఉన్న ఇంటి యజమాని పద్మావతిని రాజేష్ కత్తితో బెదిరించి 13 తులాల బంగారు గాజులు, పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. బాధితరాలి ఫిర్యాదు మేరకు మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు, క్రైం ఇన్‌స్పెక్టర్ నానునాయక్ దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారాలతో రాజే్‌షను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అంబర్‌పేటలో శుక్రవారం అరెస్టుచేశారు. అతడికి సహకరించిన రజినీని కూడా పోలీసులు అరెస్టుచేశారు.వీరివద్దనుంచి 13 తులా ల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.