లాక్‌డౌన్ సమయంలో అగ్ర కథానాయిక సమంత అర్బన్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ స్వగృహంలోని టెర్రస్‌పై ఏర్పాటు చేసుకున్న తోటలో సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలతో పాట కూరగాయల్ని పండిస్తోంది. తాను ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాల్ని వివరిస్త్తూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆరోగ్య శ్రేయస్సుతో పాటు పర్యావరణ సంరక్షణ కోసమే తాను ఇంటివద్ద కూరగాయల్ని పండిస్తున్నానని చెప్పింది. ‘ఆహారం చాలా విలువైనదని మనలో చాలా మంది గుర్తించరు.
ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది కదా అనే భావనలో ఉంటాం. మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్ చేసి భోజనాన్ని ఇంటికి తెప్పించుకుంటాం. లాక్‌డౌన్ మొదలైన తర్వాత నేను, చై (నాగచైతన్య) సూపర్‌మార్కెట్‌కు వెళ్లి కావల్సిన సరుకులు, కూరగాయల్ని తెచ్చుకున్నాం. కొన్ని రోజుల గడిచిన తర్వాత స్వచ్ఛమైన కూరగాయల అవసరం తెలిసొచ్చింది. అందుకే టెర్రస్‌పై కృతిమ్రంగా తోటను ఏర్పాటు చేసి కూరగాయల్ని పండించాలనుకున్నా. సొంతంగా చేసే వ్యవసాయంలోని ఆనందం వెలకట్టలేనిది’ అని సమంత సంతోషం వ్యక్తం చేసింది.