రాజమండ్రి: మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ప్రత్యేక హెలికాప్టర్‌లో కాకినాడ నుంచి బెంగుళూరు ఆస్పత్రికి దొరబాబును తరలించారు. శనివారం ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. దొరబాబుకు కొవిడ్ రావడంతో సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.