రోడ్డు మీద ఓ యువకుడు కుడి కాలు పూర్తిగా తెగిపోయి.. గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ వైపు వచ్చీపోయేవారు అక్కడ ఆగి తమ జేబుల్లోంచి సెల్‌ఫోన్లను బయటకు తీసి ఫొటోలు తీస్తున్నారు. అంతలో అక్కడో కారు ఆగింది. అందులోంచి ఓ వైద్యుడు దిగి.. బాఽధితుడిని ఎత్తుకొని తన కారు వెనుక సీట్లో పడుకోబెట్టి తాను పనిచేస్తున్న ఆస్పత్రికి తీసుకెళ్లి.. స్వయంగా చికిత్స చేశారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఏవో డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఔదర్యారం ఇది! ఖమ్మం సమీపంలో కోదాడ క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుడికాలు పాదం నుంచి పైకి అడుగున్నర మేర తెగిపోయి దూరంగా పడింది. అదే సమయంలో డాక్టర్ రాజశేఖర్, ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతూ ఘటనాస్థలిలో ఆగారు. బాధితుడిని తన సొంతకారులో వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స చేశారు. స్థానికులు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది డాక్టర్ రాజశేఖర్‌ను అభినందించారు.
