‘‘షర్మిలారెడ్డి జగన్ వదిలిన బాణమే! రాజన్య రాజ్యం కేవలం ఒట్టిమాటే!!’’ అని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. లోట్‌సపాండ్ నుంచి ఆమె మాట్లాడడంతోనే.. ‘నేను ఆమె వెనుక ఉన్నా’ అనే సంకేతాన్ని జగన్ ప్రజల్లోకి పంపారని తెలిపారు. తనపై కేసులకు భయపడి బీజేపీ రహస్య అజెండాను జగన్ అమలు చేస్తున్నారని, తెలంగాణలో క్రిస్టియన్, దళిత ఓటర్లను లాక్కుని కాంగ్రె్‌సను దెబ్బకొట్టడం ద్వారా బీజేపీకి ప్రయోజనం చేయడమే షర్మిల పార్టీ లక్ష్యమని వెల్లడించారు. బుధవారం ఫేస్‌బుక్ లైవ్‌లో హర్షకుమార్ మాట్లాడుతూ.. ‘‘జగన్ జైలులో ఉన్నప్పుడు జగనన్న సంధించిన బాణంగా చెప్పుకుంటూ తెలంగాణలో ఆమె పాదయాత్ర చేశారు. వాస్తవానికి ఆమె రాయలసీమలో పుట్టినప్పటికీ, ఆమె భర్త అనిల్‌కుమార్ హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి ఆమెను హైదరాబాదీగానే పరిగణించాలి.

షర్మిల మంగళవారం పెట్టిన మీటింగ్ తర్వాత చాలా అంచనాలు వచ్చాయి. జగన్ సీఎం అయ్యాక ఆమెకు ఎంపీగానీ, మంత్రిగానీ, ఇస్తారనుకున్నారు. కానీ ఇవ్వలేదు. లోటస్ పాండ్‌లో మీటింగ్ పెట్టడం వల్ల జగన్ తెలంగాణ ప్రజలకు, వైసీపీ అభిమానులకు సంకేతాన్ని సూటిగా పంపారు’’ అని తెలిపారు. జగన్ మాట కాదని ఆమె పార్టీ పెట్టగలదా? జగన్ మాట కాదన్నవారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా? అని ప్రశ్నించారు. షర్మిల పార్టీ గురించి కథనం వచ్చిన తర్వాత కూడా ఆమెను ఎక్కడ ఎలా ఆపాలో జగన్‌కు తెలియదా? అని అన్నారు. బీజేపీ రహస్య అజెండాను జగన్ అమలు చేస్తున్నారని అర్థమవుతోందన్నారు. ‘‘షర్మిల మాటలు నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు’’ అని తెలంగాణ ప్రజలకు హర్షకుమార్ పిలుపునిచ్చారు.