గాలి సంపత్’ ఓటీటీలో వచ్చేస్తుంది. నిజమే మీరు వినేది. విడుదలై వారం కూడా కాలేదు అప్పుడే ఓటీటీలోకి అంటే.. నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ టైటిల్ పాత్రలో నటించిన ‘గాలి సంపత్’ చిత్రం మార్చి 19న ఓటీటీలో విడుదల కాబోతోందని.. ‘ఆహా’ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం.. విడుదల రోజు మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా వీక్ అవ్వడంతో.. వెంటనే మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పించిన విషయం తెలిసిందే.

యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి నిర్మించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. కానీ పోటీగా మరో రెండు సినిమాలు విడుదలవ్వడం.. అవి కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుండటంతో.. మేకర్స్ ఊహించినంతగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అందుకే ఓటీటీలో విడుదల చేసి.. నేరుగా ప్రేక్షకుల దగ్గరకే ‘గాలి సంపత్’ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. విడుదలై వారమే అవుతుంది కాబట్టి.. ఈ చిత్రం ఓటీటీలో బిగ్ సక్సెస్ సాధిస్తుందనే ధీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.