బుల్లితెరపై ఆర్.కె.నాయుడుగా మాస్ స్టార్ ఇమేజ్ ఉన్నవీర్‌సాగర్ వెండితెరపై హీరోగా రాణించాలని ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాలే చేస్తూ వస్తున్నాడు. ‘సిద్ధార్థ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ వంటి సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. ఈ తరుణంలో వీర్ సాగర్ కాస్త గ్యాప్ తీసుకుని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో టాలీవుడ్‌లోని ప్రస్తుత అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు సినిమా మధ్యలో నిర్మాతగా జాయిన్ అయ్యాడు. దిల్‌రాజు రాకతో ‘షాదీ ముబారక్’ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. నిజానికి ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావాల్సింది. కానీ.. కోవిడ్ ప్రభావంతో ఆగింది. ఎట్టకేలకు ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘షాదీ ముబారక్’ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంది? కంటెంట్ నచ్చి సినిమా నిర్మాణంలో భాగమైన దిల్‌రాజు నమ్మకం నిజమైందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

కథ :-
సున్నిపెంట మాధవ్(వీర్‌సాగర్) ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పెళ్లి చూపుల కోసం వస్తాడు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పిన్ని బాబాయ్‌ల దగ్గరే పెరుగుతాడు మాధవ్. వీరు హైదరాబా్‌లో ఉంటారు. మాధవ్ మాత్రం ఉద్యోగ్య రీత్యా ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తాడు మాధవ్. ఈ క్రమంలో ఆ మ్యారేజ్ బ్యూరోను నిర్వహించే మహిళ(రాజశ్రీనాయర్)కు కాలు బెణుకుతుంది. ఆమె పెళ్లి చూపులకు మాధవ్‌ను తీసుకెళ్లడానికి వీలు లేకుండా పోతుంది. దాంతో ఆమె మాధవ్‌ను పెళ్లి చూపులకు తీసుకెళ్లే బాధ్యతలను తన కుమార్తె తుపాకుల సత్యభామ(దశ్యా రఘునాథ్)కు అప్పగిస్తుంది. పుట్టినరోజు అయినప్పటికీ అమ్మ కోసం మాధవ్‌ను మూడు పెళ్లి చూపులకు తీసుకెళుతుంది సత్యభామ. ఈ ప్రయాణంలో మాధవ్, సత్యభామలకు ఒకరి గురించి ఒకరికి తెలిసే నిజాలేంటి? ఒకరిపై ఒకరు మనసుపడ్డ మాధవ్, సత్యభామ ఎలా ఒకటవుతారు? అనే విషయాలు తెలియాలంటే ‘షాదీ ముబారక్’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :-
పెళ్లి చూపుల కోసం విదేశాల నుంచి ఇండియా వచ్చిన ఓ అబ్బాయి.. ఆ అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకెళ్లే ఓ అమ్మాయి మధ్య ప్రేమ కథే ఈ ‘షాదీ ముబారక్’ సినిమా. నటీనటుల విషయానికి వస్తే.. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన వీర్‌సాగర్, ప్రారంభంలో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ క్రమంలో తన స్నేహితులతో కలిసి సాగర్ చేసిన మరో ప్రయత్నం ‘షాదీ ముబారక్’. అయితే ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు వీర్‌సాగర్. లుక్ పరంగా వీర్‌సాగర్ బాగా ఉన్నాడు. ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనరే కాదు.. భారీ డైలాగులు, ఫైట్స్, డాన్సులు చేసే కథ కాదు కాబట్టి, సాగర్ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. కథా పరంగా డిజైన్ చేసిన తన పాత్రలోని కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ దృశ్యా రఘునాథ్.. తొలి సినిమానే అయినా, నటనతో చక్కగా ఆకట్టుకుంది. మన పక్కింటి అమ్మాయిని పోలిన పాత్రను దృశ్య చక్కగా క్యారీ చేసింది. ఎక్కడా తొలి సినిమా హీరోయిన్ అనే ఫీల్ తెప్పించకుండా చక్కగా చేసింది. హీరో స్నేహితుడిగా భద్రమ్ చేసిన బంతి బాలు పాత్ర ఉండేది తక్కువే అయినా, హీరో సీక్రెట్స్ అంతా రివీల్ చేస్తూ కామెడీని క్రియేట్ చేయడంలో భద్రమ్ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే కారు డ్రైవర్ రమేష్ పాత్రలో రాహుల్ రామకృష్ణ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో తన భార్య, బావ మరిదితో ఫోన్‌లో మాట్లాడే సన్నివేశాలు, సందర్భానుసారం వచ్చే డైలాగులు ఈ పాత్రను ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తాయి. సినిమాలో అమెరికా యువకుడిగా పెళ్లి సంబంధాలు చూసే వ్యక్తి పాత్రలో ఆర్.జె.హేమంత్ తన వంతుగా నవ్వించాడు. బెనర్జీ, హేమ, రామ్, రాజశ్రీ నాయర్, మధునందన్, అజయ్ ఘోష్ ఇలా అందరూ వారి వారి పాత్రలను క్యారీ చేసిన విధానం బావుంది.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే…
ముందుగా దర్శకుడు పద్మశ్రీ విషయానికి వస్తే ఇది వరకు ప్రస్తావించినట్లు పెళ్లి చూపుల కోసం విదేశాల నుంచి ఇండియా వచ్చిన ఓ అబ్బాయి.. ఆ అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకెళ్లే ఓ అమ్మాయి మధ్య ప్రేమ కథా చిత్రమే ‘షాదీ ముబారక్’. అబ్బాయి, అమ్మాయి కలిసి చేసే ప్రయాణంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటం.. అది పెళ్లిగా ఎలా దారి తీసిందనే, అందరికీ తెలిసిన లవ్‌స్టోరినీ ఎంటర్‌టైనింగ్‌గా చక్కగా మలిచాడు దర్శకుడు. సన్నివేశాలను డీవియేట్ చేయనీయకుండా చక్కటి డైలాగ్స్‌తో ఎక్కడా బోర్ అనిపించకుండా సినిమా సాగుతుంది. హీరో తండ్రి గురించి హీరోయిన్ తండ్రి చెప్పే డైలాగ్‌ను క్లైమాక్స్‌కు ముడిపెట్టడం, అలాగే హీరోని హీరోయిన్ ఇష్టపడే సందర్భంలో హీరో చెప్పే భార్యాభర్తల బంధం గురించిన టాపిక్ లాంటివి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఇవన్నీ దర్శకుడి సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడనటానికి ఎగ్జాంపుల్స్‌గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు డెబ్బై శాతం ఓ స్మైల్‌తో ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేస్తాడనంలో సందేహం లేదు.
కామెడీ డైలాగ్స్‌తో పాటు ప్రేమ, పెళ్లి గొప్పతనాన్ని గురించి చెప్పే సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బావుంది. పాటలన్నీ మాంటేజ్ సాంగ్స్. క్లైమాక్స్ ముందు వచ్చే ఓ పాటలో ‘ఇన్నేళ్ల వీరి ప్రయాణం ఎప్పుడో పురిటిలోనే ప్రారంభమైంది… ’ అంటూ రాసిన ఓ లైన్ సినిమా స్టోరినంతా వివరిస్తుంది. అలాగే హీరో, హీరోయిన్ ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు వచ్చే ‘నీ మనసే తనలో చేరేనా.. ’అంటూ సాగే పాట… ఇలా సాంగ్స్‌లో మంచి లిరిక్స్ కుదిరాయి. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ బావుంది. మధు ఎడిటింగ్ బావుంది.
ఇక కథ పరంగా చూస్తే కథలో కొత్తదనం లేదు. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు తెలుసుకోకుండా స్టార్ట్ చేసే ప్రయాణంలో ఒకరి గురించి ఒకరికి తెలిసి ప్రేమలో పడటం.. తర్వాత అమ్మాయి హీరోపై కోపంతో మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం, హీరో తన ప్రేమను హీరోయిన్‌కి వివరించే ప్రయత్నం చేయడం, ఆమె ముందు వినిపించుకోకపోయినా, తర్వాత హీరో ప్రేమను హీరోయిన్ గుర్తించే సందర్భాలు రావడం ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. ఫైట్స్, డాన్సులు లేవు.. కాబట్టి మాస్ మసాలా సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులకు సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. సినిమాలో నాయకానాయికల మధ్య ప్రేమలో అంత పెద్ద సంఘర్షణ ఉండాల్సిన అవసరం ఎందుకా అని కూడా అనిపిస్తుంది.