వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఊరట విజయం దక్కింది. మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై నాకౌట్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన ఒలింపిక్ రజత పతక విజేత సింధు.. ఆఖరిదైన నామమాత్రపు మ్యాచ్‌లో గెలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21-18, 21-15తో ప్రపంచ 13వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువాంగ్‌పై విజయం సాధించింది. కాగా.. పురుషుల సింగిల్స్‌లో వరుసగా రెండు ఓటములతో నాకౌట్ చేరడంలో విఫలమైన భారత ఏస్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ చివరి మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. గ్రూప్-బిలో శ్రీకాంత్ 21-12, 18-21, 19-21తో హాంకాంగ్ షట్లర్ ఎంగ్ కా లాంగ్ ఆగ్నస్ చేతిలో పోరాడి ఓడాడు. 2018లో ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన సింధు.. ఆ మరుసటి ఏడాది కూడా నాకౌట్‌కు ముందే వెనుదిరిగింది.