సెంచరీ కొట్టిన పెట్రోల్‌

0
183
Spread the love

అందరూ అనుకుంటున్నట్టుగానే పెట్రోల్‌ సెంచరీ కొట్టేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా రాజస్థాన్‌లో బుధవారం లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దాటేసి రూ.100.13కు చేరుకుంది. ఇతర రాష్ట్రాల్లోనూ వంద దిశగా పరుగులు పెడుతోంది. చమురు సంస్థలు వరుసగా తొమ్మిదో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. బుధవారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 25పైసల చొప్పున వడ్డించాయి. తొమ్మిది రోజుల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.2.59, డీజిల్‌ ధర రూ.2.82 పెరిగింది. ఇప్పటికే బ్రాండెడ్‌ పెట్రోల్‌ ధర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటేసింది. ఇప్పుడు మొదటిసారి రెగ్యులర్‌ పెట్రోల్‌ ధర రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఈ మార్క్‌ను అధిగమించింది. రాజస్థాన్‌లో అధిక వ్యాట్‌ ఉండటం వల్ల ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి.

తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.89.54కు, డీజిల్‌ ధర రూ.79.95కు చేరుకుంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96కి, డీజిల్‌ ధర రూ.86.98కి చేరింది. ఇక మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.99.90కి, డీజిల్‌ ధర రూ.90.35కు చేరుకుంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ..93.10కి చేరుకోగా.. డీజిల్‌ ధర రూ.87.20కి చేరింది. లీటరు పెట్రోల్‌ రిటైల్‌ ధరపై కేంద్ర, రాష్ట్ర పన్నులు 60 శాతం ఉండగా.. డీజిల్‌పై 54 శాతంగా ఉన్నాయి. లీటరు పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్‌ సుంకం వసూలు చేస్తోంది. రాష్ట్రాలు వ్యాట్‌తో బాదేస్తున్నాయి. రానున్న కాలంలో పెట్రోబాదుడు ఇంకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ (ఐవైసీ) కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. కాగా దేశంలో పెట్రోల్‌ ధర రూ.100 దాటిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గత ప్రభుత్వాలు దేశం ఇం ధన దిగుమతిపై అధారపడే అవసరం తగ్గేలా దృష్టి పెట్టి ఉంటే మధ్యతరగతిపై భారం పడి ఉండేదికాదన్నారు. తమిళనాడులో ఆయిల్‌, గ్యాస్‌ ప్రాజెక్టులను బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. తానెవరినీ విమర్శించదలచుకోవడం లేదంటూనే గతంలో ఈ అంశంపై దృష్టిపెట్టామా అని ప్రధాని వ్యాఖ్యానించారు. అదే జరిగి ఉంటే మధ్యతగతిపై భారం పడి ఉండేది కాదంటూ గత ప్రభుత్వాలను నిందించారు.ఇంధనాల్లో సహజవాయువు వాటాను 6.3 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం పని చేస్తోందని, దీన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here