ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో ప్రామాణిక సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎ్‌సఈ సెన్సెక్స్ 609.83 పాయింట్లు (1.18 శాతం) బలపడి 52,154.13 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 151.40 పాయింట్లు (1.0 శాతం) పుంజుకొని 15,314.70 వద్ద స్థిరపడింది. అంతేకాదు, సెన్సెక్స్ 52,235.97 వద్ద, నిఫ్టీ 15,340.15 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే రికార్డులను సైతం నమోదు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు నేపథ్యంలో ట్రేడర్లు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి మళ్లీ పుంజుకోవడంతోపాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడమూ మార్కెట్లకు కలిసివచ్చింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 19 లాభాల్లో ముగియగా.. మిగతా 11 నష్టాలు చవిచూశాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈ బ్యాంకింగ్ సూచీ 3.31 శాతం, ఫైనాన్స్ ఇండెక్స్ 2.71 శాతం పెరిగాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ షేర్ల సూచీ 1.40 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం పెరిగాయి.

రూ.205 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్ : ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్ 4,402.8 పాయింట్లు పుంజుకుంది. ఈ సుదీర్ఘ ర్యాలీలో మార్కెట్ సంపద కూడా అనూహ్యంగా పెరిగింది. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.205 లక్షల కోట్లు అధిగమించింది.
ఏడాది గరిష్ఠానికి రూపాయి
దేశీయ కరెన్సీ విలువ దాదాపు ఏడాది గరిష్ఠ స్థాయికి పెరిగింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 7 పైసలు బలపడి 72.68కి చేరుకుంది. దేశీయ స్థూల ఆర్థికాంశాల్లో సానుకూలత, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం ఇందుకు దోహదపడింది.