మెల్‌బోర్న్: ఓపెన్ ఎరాలో అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలన్న సెరెనా విలియమ్స్ కల మరోసారి భగ్నమైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సెరెనా జోరుకు జపాన్ ప్లేయర్ నవోమి ఒసాక బ్రేకులు వేసింది. మరో సెమీస్ మ్యాచ్‌లో చెక్ భామ కరోలినా ముచోవాపై నెగ్గి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అమెరికా భామ జెన్నిఫర్ బ్రాడీ.. శనివారం జరిగే టైటిల్ పోరులో ఒసాకను ఢీకొననుంది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా 3-6, 4-6తో మూడో సీడ్ ఒసాక చేతిలో వరుస సెట్లలో చిత్తయింది. ఈ విజయంతో 2019 చాంపియన్ నవోమి.. రెండోసారి మెల్‌బోర్న్ పార్క్‌లో ఫైనల్ ఆడనుంది.

తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. తర్వాతి గేమ్ గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, ఇక్కడి నుంచి సెరెనా ఆట గాడితప్పింది. దీంతో పుంజుకొన్న ఒసాక.. సెరెనాను ఒత్తిడిలోకి నెట్టి 6-3తో సెట్‌ను సొంతం చేసుకొంది. రెండో సెట్ ఆరంభం నుంచే మెరుగైన ప్రదర్శన చేసిన ఒసాక 4-3తో పైచేయి సాధించింది. అయితే, ఆ తర్వాతి గేమ్‌లో నవోమి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా 4-4తో మ్యాచ్‌లోకి వచ్చింది. కానీ, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు గేమ్‌లు నెగ్గిన ఒసాక.. సెట్‌తోపాటు మ్యాచ్‌ను నెగ్గి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో 24 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా అందుకు మూల్యం చెల్లించుకొంది. ఒసాక 6 ఏస్‌లు వేస్తే.. సెరెనా 3 మాత్రమే సంధించింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో 23వ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన 39 ఏళ్ల సెరెనా.. తర్వాత నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో ఫైనల్ చేరినా విజేతగా నిలవలేక పోయింది. ఇక టాప్ సీడ్ ఆష్లే బార్టీపై అద్భుత విజయం సాధించిన ముచోవా పోరాటం ముగిసింది. 22వ సీడ్ జెన్నిఫర్ 6-4, 3-6, 6-4తో ముచోవాపై గెలిచింది.
జొకో అలవోకగా..:
హ్యాట్రిక్ టైటిల్‌పై గురి పెట్టిన డబుల్ డిఫెండింగ్ చాంప్ నొవాక్ జొకోవిచ్.. 9వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. రష్యాకు చెందిన 114వ ర్యాంకర్ అస్లన్ కరట్‌సెవ్ క్వాలిఫయర్‌గా సంచలన విజయాలతో సెమీస్‌కు చేరినా.. నొవాక్ ముందు తలవంచక తప్పలేదు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సెర్బియా ఆటగాడు జొకో 6-3, 6-4, 6-2తో అస్లన్‌పై సునాయాసంగా గెలిచాడు. ఏకంగా 17 ఏస్‌లతో అస్లన్‌ను బెంబేలెత్తించాడు. గతంలో ఫైనల్ చేరిన 8సార్లు జొకో విజేతగా నిలిచాడు.
ఇదే ఆఖరా..? :
ఓటమితో సెరెనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. హృదయంపై చేయి ఉంచి.. వీడ్కోలు అన్నట్టుగా వ్యవహరించింది. ప్రెస్‌మీట్‌ను కూడా అర్ధంతరంగా ముగించింది. ‘ఇదే మీ ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెనా?’ అని అడిగిన ఓ విలేకరి ప్రశ్నకు సెరెనా కన్నీళ్ల పర్యంతమైంది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. కానీ, ఆమె నిష్క్రమిస్తున్నప్పుడు అన్న మాటలు మాత్రం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ‘ఏమో తెలియదు. కెరీర్‌కు వీడ్కోలు పలికితే.. ఎవరికీ చెప్పకుండా చేస్తానేమో..’ అని పేర్కొనడం గమనార్హం.