ఉరితాడు ప్యాన్‌కు వేలాడింది. చావు చివరి కోరిక వీడియో సందేశాన్ని పోన్ ద్వారా పంపాడు. చివరికి ఆ సందేశం ఆధారంగానే అతన్ని ఉరితాడు నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. 7 నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకుని చేర్చిన సంఘటన మంచిర్యాల జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. చెన్నూరులోని ఓ వ్యక్తి కుటుంబ సమస్యలతో బాధపడుతూ అత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్యాన్ ఉరివేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో తను చనిపోతున్నానని ఓ వీడియో తీసి దాన్ని కుటుంబ సభ్యులకు పంపించాడు.వెంటనే అప్రమత్తమైన అతని తల్లి, మిత్రులు చెన్నూరు పోలీసులను ఆశ్రయించారు. పోన్ సందేశాన్ని పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ఉరేసుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే సంబంధిత ప్రాంతానికి పోలీసులు నిమిషాల్లో చేరుకొని బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాలలో జరిగిపోవడంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసుల తీరును కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ తన ట్విటర్‌లో షేర్ చేశారు.