ఈత సరదా ఇద్దరు యువకులను బలితీసుకుంది. బంధువుల ఇంట్లో దేవరకు స్నేహితుడితో కలసి వెళ్లి, తిరిగి వస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లారు. పెద్దకడు బూరు మండలంలోని పులికనుమ కాలువలో మునిగి ఆదోనికి చెందిన విజయ్(20), లక్ష్మన్న(28) మృత్యువాత పడ్డారు. కోసిగి సీఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు ఆదోనిలోని మరాఠి గేరికి చెందిన విజయ్, ప్రకాష్‌నగర్‌కు చెందిన లక్ష్మన్న స్నేహితులు. విజయ్ బంధువులు కోసిగిలో ఎల్లమ్మ దేవర చేస్తుండటంతో ఇద్దరూ వెళ్లారు. దేవర ముగించుకుని తిరిగి వస్తూ.. పెద్దకడుబూరు మండలం గవిగట్టు క్రాస్ రోడ్డులో బాపులదొడ్డి పులికనుమ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీట మునిగి ఊపిరాడక మృతి చెందారు. కాలువలోకి వెళ్లిన యువకులు ఎంతకూ బయటకు రాకపోవడంతో సమీపంలోని రైతులు వెళ్లి చూశారు. అప్పటికే స్నేహితులు ఇద్దరూ చనిపోయారు. కోసిగి సీఐ ఈశ్వరయ్యకు, పెద్దకడుబూరు ఎస్‌ఐ శ్రీనివాసులకు సమాచారం అందించారు. సీఐ ఈశ్వరయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మన్నకు భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. విజయ్‌కి ఇంకా పెళ్లి కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
