స్పెక్ట్రమ్ వేలానికి టెలికాం సంస్థల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలం మంగళవారం ముగిసింది. ఈ వేలంలో 3జీ, 4జీ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు పోటీపడ్డాయి. ఇందుకోసం రూ.77,814.80 కోట్ల విలువైన బిడ్స్ సమర్పించాయి. ఈ బిడ్డింగ్‌లోనూ రిలయన్స్ జియోదే అగ్రస్థా నం. ఈ కంపెనీ దేశంలోని 22 టెలికాం సర్కిల్స్‌లో స్పెక్ట్రమ్ కోసం రూ.57,122.65 కోట్లు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ బిడ్‌ను అంగీకరిస్తే కంపెనీ చేతిలో ఉండే స్పెక్ట్రమ్ 55 శాతం పెరిగి 1717 మెగాహెర్జ్‌కు పెరుగుతుంది. ఈ వేలంలో భారతీ ఎయిర్‌టెల్ రూ.18,698.7 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.1,993.40 కోట్లతో స్పెక్ట్రమ్ కొనుగోలు చేశాయి. కాగా ఈ వేలం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ప్రభుత్వం రూ.19,000-20,000 కోట్లు అందుకోవచ్చని అంచనా. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో మరో రూ. 6,000-రూ.7,000 కోట్ల వరకు ప్రభుత్వం అందుకునే వీలుంది.
