ఆనంద్‌బాగ్ : ఆలయంలో హుండీ దొంగతనానికి యత్నించిన పీ వెంకటేష్(37)కు 3నెలలు సాధారణ జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ 17వ ఎంఎం కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 22న ఉదయం మల్కాజిగిరి ప్రేమ్‌విజయ్‌నగర్‌కాలనీలోని శ్రీ కోదండరామ ఆలయం, శ్రీ సాయిసేవాసమాజ్ ఆలయం తలుపు తీసేసరికి ఆలయంలోని దుర్గామాత ఆలయం వద్ద హుండీని పగలకొట్టేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లను గమనించిన ఆలయ నిర్వాహకుడు సికిలం పద్మారావు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను దమ్మాయిగూడలో అరెస్టు చేసి సాక్ష్యాధారాలతో కోర్టుకు పంపారు. పరిశీలించిన కోర్టు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.