దేశీయ, ముఖ్యంగా తెలంగాణ ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ రంగాలకు కొవిడ్ ఊహించని గొప్ప అవకాశాన్ని అందించింది. జీవిత కాలంలో ఇటువంటి అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ), ఇన్నోవేషన్ నుంచి మెడికల్ డివైసెస్ వరకూ అన్ని విభాగాల్లో భారీ అవకాశాలు లభించనున్నాయి. ఏ స్థాయిలో పరిశ్రమ వృద్ధి చెందగలదో ఆ స్థాయిలో వృద్ధి చెందడానికి మంచి అవకాశం లభించిందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. ‘బయోఏషియా 2021’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అర్థం చేసుకుంది. ఈ రంగంలోని నిపుణులు, విధానకర్తలను కలుసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు.

త్వరలో సిఫారసులు: తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగ అభివృదిక్ధి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ తన సిఫారసులను త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. వివిధ విభాగాలపై నియమించిన ఉప కమిటీలు సిఫారసులను అందజేయనున్నట్లు సతీశ్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీకి సతీశ్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణ పరిశ్రమ 2030 నాటికి లక్ష్యాలను నిర్ణయించుకుంది. హైదరాబాద్ ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటి కానుంది. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, ఇన్నోవేషన్ ఆధారంగా ఈ లక్ష్యాన్ని చేరనున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఫార్మా రంగం ఆదాయం 1,300 కోట్ల డాలర్లు (దాదాపు రూ.93,600 కోట్లు) ఉంది. దేశీయ పరిశ్రమ ఆదాయం 4.200 కోట్ల డాలర్లుగా ఉంది. కాగా 2030 నాటికి దేశీ య పరిశ్రమ ఆదాయం 12,000 కోట్ల డాలర్లు, తెలంగాణ పరిశ్రమ ఆదాయం 3,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.5 లక్షల కోట్లు), ఫార్మా, లైఫ్ సైన్సెస్ వ్యవస్థ ఆర్థిక విలువ 100 కోట్ల డాలర్లకు చేరగలదని చెప్పారు. కాగా దేశీయు ఔషధ పరిశ్రమ ఆదాయంలో మూడో వంతు తెలంగాణదేనని సతీష్ రెడ్డి అన్నారు.
ఇన్నోవేషన్ హబ్ జీనోమ్ వ్యాలీ: హైదరాబాద్ ఇన్నోవేషన్‌కు గమ్యస్థానమైంది. తెలంగాణలో ప్రపంచ స్థాయి కంపెనీలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు ఉన్నాయి. నిపుణులకు కొదవ లేదు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థ చాలా బాగుంది. అన్నింటికీ మించి ప్రభుత్వం విధానాలు పరిశ్రమకు అండగా నిలుస్తున్నాయని సతీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో దేశీయ కంపెనీలే కాక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. జీనోమ్ వ్యాలీ ఇన్నోవేషన్ హబ్ కానుందని అన్నారు.