తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 15వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత 16వ తేదీన దివంగత ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానం ఉంటుంది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. 18వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం, ఈ సమావేశాలు మార్చి ఆఖరు వరకు జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి మరో రూ.169.29 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా నిధులతో రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం రూ.2,196.62 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని చెల్లించినట్లయింది.

మరో రూ.1,050 కోట్ల రుణం
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.1,050 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని తీసుకుంది. కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మరో రూ.1,050 కోట్ల రుణాన్ని తీసుకుంది.