30 శాతం! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫిట్‌మెంట్‌

0
157
Spread the love

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! వారికి మాత్రమే కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంటాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ తీపికబురు! వారంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ ప్రకటన వచ్చేసింది! రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో సోమవారం ప్రత్యేక ప్రకటన చేశారు. ఫిట్‌మెంట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 9,17,797 మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. అంతేనా, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, హోం గార్డులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏవోలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, దినసరి కూలీ తదితర ఉద్యోగులందరికీ వేతనాల పెంపు వర్తింపజేస్తున్నామని ప్రకటించారు. ఫిట్‌మెంట్‌తోపాటు ఉద్యోగులపై మరిన్ని వరాలూ కురిపించారు. గత ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలనే లక్ష్యంతోనే వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈహెచ్‌ఎస్ పై స్టీరింగ్‌ కమిటీ

పీఆర్సీ సూచనల మేరకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) నూతన విధివిధానాలను రూపొందించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

కరోనా కారణంగానే పీఆర్సీ ఆలస్యం

కరోనా విపత్తు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపేసిందని, అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు కారణంగా 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ప్రజా జీవనంతోపాటు ఆర్థిక కార్యకలాపాలూ స్తంభించిపోయాయి. రాబడి తగ్గడంతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. మెరుగైన వేతన సవరణ చేస్తున్నాం’’ అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని సాధ్యాసాధ్యాలను ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలుగా తానే చర్చించానని సీఎం చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉన్న ప్రత్యేక అభిమానంతో 12 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించాలని నిర్ణయించామన్నారు.రాష్ట్ర సాధనలో ఉద్యోగులు స్ఫూర్తిమంతమైన భూమికను పోషించారని, స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగులకు 43% అత్యధిక ఫిట్‌మెంట్‌ అందించామని, ఉద్యోగుల పట్ల తన అభిమానాన్ని ప్రభుత్వం ఘనంగా చాటుకుం దని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తమ పేరును మార్చుకోని ఏకైక సంఘం టీఎన్జీవో అని, తెలంగాణ నినాదంతోనే ఆ సంఘం కొనసాగిందని, అదో స్ఫూర్తి అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

త్వరలోనే ఖాళీ కొలువుల భర్తీ

‘‘ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టింది. 80% ప్రక్రియ పూర్తయింది. మిగతా పదోన్నతులను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది. తర్వాత ఏర్పడే ఖాళీ కొలువుల భర్తీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

కేసీఆర్‌ ప్రకటనలోని ముఖ్యాంశాలు

ఉద్యోగుల గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇచ్చే 15 శాతం అదనపు పెన్షన్‌ వయో పరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గింపు.

విధి నిర్వహణలో మరణించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్‌ విధానం వర్తింపు.

ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించడంతోపాటు బదిలీల ప్రక్రియను వెంటనే నిర్వహించాలని నిర్ణయం.

ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఖ్య పది వేలకు చేరేలా అదనపు ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరు. ఈ పోస్టు స్కూల్‌ అసిస్టెంట్‌కు సమాన స్థాయిగా ఉంటుంది.

వేర్వేరు జిల్లాల్లో పని చేస్తున్న భార్యాభర్తలు ఒకేచోట పని చేసేందుకు వీలుగా అంతర్‌ జిల్లా బదిలీల ప్రక్రియ వెంటనే ప్రారంభం. జిల్లా మాత్రమే కాదు.. ఒక యూనిట్‌.. వీలైతే ఒకే మండలంలో పని చేసేలా విధివిధానాల రూపకల్పన.

తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి రాష్ట్రానికి తిరిగి పంపేందుకు ప్రభుత్వ అనుమతి. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటన.

కేజీబీవీల్లోని మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12 నెలల పీఆర్సీ బకాయిల చెల్లింపు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తో కలిపి వీటి అందజేత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here