పాపం..అకిల దనంజయ. అంతకుముందు ఓవర్లో హ్యాట్రిక్ తీసిన ఈ శ్రీలంక లెగ్‌స్పిన్నర్ ఆనందాన్ని ఆవిరి చేస్తూ విండీస్ బిగ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చుక్కలు చూపాడు. ఈ అరుదైన ఘటనలు రెండు జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఇంకా 41 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లతో నెగ్గింది. 132 పరుగుల లక్ష్య ఛేదనలో..ఓపెనర్ల్లు ధాటిగా ఆడడంతో 3.2 ఓవర్లలో వెస్టిండీస్ 52/1 స్కోరుతో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో తన రెండో ఓవర్లో లూయిస్ (28), గేల్ (0), పూరన్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసిన దనంజయ హ్యాట్రిక్ నమోదు చేశాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు మిగలలేదు.

6-6: తన మూడో ఓవర్ వేసేందుకు అకిల రాగా..మొదటి బంతిని మోకాళ్లపై కూర్చొని లాంగాన్ దిశగా భారీ సిక్సర్‌గా మలచిన పొలార్డ్ తన రికార్డు పరంపరకు తెరతీశాడు. రెండో బంతిని సైట్‌స్ర్కీన్ తగిలేలా కొట్టాడు. ఆపై ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వేసిన మూడో బంతిని లాంగాఫ్‌మీదుగా బయటికి పంపాడు. ఇక నాలుగో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా సంధించిన పొలార్డ్, ఐదో బంతిని బౌలర్ తలమీదుగా లాంగాన్ దిశలో పంపాడు. అలాగే చివరి బంతిని మిడ్ వికెట్‌వైపు మరింత సునాయాసంగా బాది మొత్తం ఆరు సిక్సర్లతో పొలార్డ్ రికార్డు పుటలకెక్కాడు. తర్వాతి ఓవర్లో పొలార్డ్ (11 బంతుల్లో 6 సిక్సర్లతో 38) నిష్క్రమించినా..వెస్టిండీస్ 13.1 ఓవర్లలో వికెట్లకు 139 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు శ్రీలంక 20 ఓవర్లలో 131/9 స్కోరు చేసింది.
ఇది మూడోసారి
శ్రీలంకతో టీ20లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఇంతకుముందు యువరాజ్ సింగ్, సౌతాఫ్రికాకు చెందిన హెర్షల్ గిబ్స్ ఈ రికార్డు అందుకున్నారు. తొలుత 2007 మార్చి 16న నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో లెగ్‌స్పిన్నర్ డాన్ వాన్ బెంగే బౌలింగ్‌లో హెర్షల్ గిబ్స్, అదే ఏడాది సెప్టెంబర్ 19న ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 వరల్డ్‌కప్ పోరులో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరేసి సిక్సర్లతో చెలరేగి చరిత్ర సృష్టించారు.