తనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు అక్కర్లేదంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ –జనసేన ఉమ్మడి బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఆయన పరోక్షంగా మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య(harirama jogaiah)ను ఉద్దేశించే చేశారనే విషయం తెలిసిందే.
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై చేగొండి హరిరామజోగయ్య రియాక్టయ్యారు. తెలుగుదేశం, జనసేన పార్టీల బాగు కోసం తాను సలహాలు ఇస్తున్నానని ఆయన చెప్పారు. తాను ఇచ్చే సలహాలు ఆ పార్టీల అధినేతలిద్దరికీ నచ్చినట్టు లేదని తెలిపారు. తన సలహాలు నచ్చకపోతే.. అది వారి ఖర్మ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇక తాను చేయగలిగిందేమీ లేదని ఆయన తెలిపారు.
తొలి నుంచీ జనసేన పార్టీకి మద్దతిస్తూ.. ఆ పార్టీ బలోపేతం కావాలన్నా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నా అసెంబ్లీలో కనీస బలం అవసరమని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తన లేఖల ద్వారా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం జనసేన పార్టీకి పొత్తులో భాగంగా 45 నుంచి 60 సీట్లు అయినా ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఇటీవల ప్రకటించిన తొలి ఉమ్మడి జాబితా సందర్భంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపైనా హరిరామజోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. ఈ క్రమంలోనే జోగయ్య లేఖలపై పవన్ బహిరంగ సభ వేదికగా అసహనం వ్యక్తం చేసినట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ముందుముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి.