‘Anti virus ఇడ్లీ, దోసె, పూరీలు.. ఇక కరోనా వ్యాక్సిన్‌తో అవసరం లేదు’

0
263
Spread the love

పేరులో ఏముంది? అని చాలా మంది అంటారు. కానీ, పేరులో చాలా ఉంది. పేరులోనే అంతా ఉంది కూడా. అందుకే సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు చాలా మంది తమ పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అదృష్టం కోసం కొందరు, ట్రెండీగా ఉండేందుకు మరికొందరు తమ పేర్లను మార్చుకుంటారు. ఆ పేరు ట్రెండీగా ఉండేలా చూసుకుంటారు. అలాగే ఆలోచించాడు ఆ హోటల్ యజమాని. ఒడిశాలోని బరంపురంలో ఉండే ఓ హోటల్ యజమాని తన హోటల్‌కు యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్ అని పేరు పెట్టాడు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు కూడా ఈ యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్ మీద జోక్స్ వేస్తున్నారు. ‘మీల్స్‌కి శానిటైజర్ కలుపుతున్నాడేమో చూడండి.’ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే, ‘కేవలం ఏ గ్రేడ్ బ్లీచింగ్ పౌడర్’ అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు.

రోడ్డు పక్కన తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు దేశంలో గల్లీకి నాలుగు ఉంటాయి. ఎవరికి వారే తమ వద్ద ఫుడ్ టేస్టీగా ఉంటుందని భావిస్తారు. కానీ, కొందరు మాత్రమే ట్రెండీగా ఆలోచిస్తారు. ఇలా జనాలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు పేర్ల విషయంలో ఆలోచిస్తే, మరికొందరు టేస్ట్ విషయంలో కొత్తగా ట్రై చేస్తారు. అలాంటి కోవలోకే ఈ యాంటీవైరస్ టిఫిన్ సెంటర్ చేరుతుందని చెబుతున్నారు.
అయితే, పేరు మాత్రం యాంటీ వైరస్ అని పెట్టాడు కానీ, అక్కడ ఏ మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. టిఫిన్ కౌంటర్ దగ్గర ఐదారుగురు వ్యక్తులు ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్క పక్కనే నిలబడి టిఫిన్ చేస్తున్నారు. ఆ పక్కనే ఓ సైన్ బోర్డు మీద ఉంది. అందులో ‘ఇక్కడ ఇడ్లీ, దోసె, ఉప్మా, వడ, సమోసా, పూరి లభించును.’ అని రాసి ఉంది.

సోషల్ డిస్టెన్స్ ఒక్కటే కాదు. మరో అంశాన్ని కూడా గుర్తించారో యూజర్. అక్కడ చెఫ్ చేతులకి గ్లౌజ్, మాస్క్, హెడ్ క్యాప్ పెట్టుకోకుండా వంట చేస్తున్నాడు. కౌంటర్లో ఉన్న వ్యక్తి ఎలాంటి గ్లౌజులు, మాస్క్ లేకుండా సర్వ్ చేస్తున్నాడు. అబ్బో యాంటీవైరస్‌లో ఇదో రకం.’ అంటూ వెటకారం చేశారు. అయితే, అతడి కామెంట్స్‌కు ఇంకో నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. ‘నువ్వు యాంటీ వైరస్ దోసె తింటే సామాజిక దూరం, మాస్క్ కూడా అక్కర్లేదు. ’ అని కౌంటర్ ఇచ్చారు.

వీటన్నిటి కంటే ముఖ్యంగా మరో నెటిజన్ చేసిన కామెంట్ అందర్నీ ఆకట్టుకుంది. ‘ఇన్ని రకాలైన యాంటీ వైరస్ ఫుడ్ అందుబాటులో ఉంటే, ఇక కరోనాకి వ్యాక్సిన్ అవసరం ఏముంది?’ అని కామెంట్ చేశారు. ‘ఈ మధ్యకాలంలో టీవీల్లో కొన్ని వ్యాపార ప్రకటనలు కూడా వస్తున్నాయి. యాంటీ వైరల్ షర్ట్లు, పరుపులు, ఫ్యాన్లు, జీన్స్‌లు, షూస్ అన్నీ యాంటీ వైరల్ వచ్చేస్తున్నాయి. ఇక వ్యాక్సిన్ అవసరం ఏంటో అర్థం కావడం లేదు.’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here